చలో విజయవాడ ఎఫెక్ట్ ప్రభుత్వంపై చాలా ఎక్కువగానే ఉంది. అన్ని విభాగాల ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో.. ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ప్రభుత్వం స్తంభించిపోతుందనే ఆందోళన ప్రభుత్వ పాలకుల్లోప్రారంభమయింది. దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాయంత్రం సమయంలో చర్చల కమిటీని పిలిపించుకుని మాట్లాడారు. వెంటనే వారికి చెప్పాల్సినవి చెప్పి.. ఉద్యోగ సంఘ నేతలను పిలిపించిమాట్లాడాలని చెప్పి పంపించారు.
మాట్లాడుకుందాం రమ్మని ఉద్యోగ సంఘాల నేతలను పిలిచి రాత్రి ఎనిమిది గంటల సమయంలో చర్చలు ప్రారంభించారు. చర్చల కమిటీలో అంతా తానై అన్నట్లుగా వ్యవహరించిన సజ్జలతో పాటు ఈ సారి సభ్యులంతా హాజరయ్యారు. ఉద్యోగులు కోరుతున్న డిమాండ్లలో కొన్నింటినీ పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ కమిటీ బతిమాలుతున్నట్లుగా తెలుస్తోంది. హెచ్ఆర్ఏ పెంపుతో పాటు సీసీసీ, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వంటి విషయాల్లో నిర్ణయాలు వెనక్కి తీసుకుంటామని చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఇప్పటి వరకూ తాము మూడు డిమాండ్లు పెట్టామని.. అవి పరిష్కరిస్తేనే చర్చల ప్రక్రియ ముందుకెళ్తుందని ఉద్యోగసంఘాల నేతలు చెబుతున్నారు. మొదటిది అర్థరాత్రి ఇచ్చిన పీఆర్సీ జీవోలను రద్దు చేయడం.. రెండోది పాత జీతాలను ఇవ్వడం.. మూడోది పీఆర్సీ నివేదిక ఇవ్వడం. ఇప్పటికే జీతాలు వేసినా.. వాటిని క్యాన్సిల్ చేసి.. పాత జీతాల లెక్కల ప్రకారం వేయాలని కోరుతున్నారు. ఈ అంశాల్లో ప్రభుత్వ స్పందనను బట్టే వారి కార్యాచరణ ఉండే అవకాశం ఉంది.