రూ. ఐదు వేలు ఇచ్చి తీసుకున్న వాలంటీర్లపై ప్రభుత్వం సర్వ హక్కులు ఉన్నాయన్నట్లుగా వ్యవహరిస్తుంది. వారితో రాజకీయంగా అన్ని అడ్డగోలు పనులు చేయించుకోవడమే కాకుండా.. ప్రభుత్వం తరపున ఎవరికి ఏ పని కావాలన్నా వాలంటీర్లు చేయాలని ఆదేశాలు జారీ చేస్తోంది. గతంలో ఇలా అనేక పనులు చెప్పిన ప్రభుత్వం తాజాగా అంగన్ వాడీ ఆయాలు సమ్మె చేస్తూంటే.. వారి పనులు కూడా చేయాలని ఆదేశించింది. వాలంటీర్లు, వార్డు సచివాలయ ఉద్యోగులు అంగన్వాడి కేంద్రాలను స్వాధీనం చేసుకుని… వారు చేసే పనులు చేయాలని ఆదేశించింది.
ప్రభుత్వ ఆదేశాలతో వాలంటీర్లు ఆశ్చర్యపోతున్నారు. స్వచ్చందంగా పని చేస్తున్నామని లేకపోతే.. ఐదు వేల జీతానికి ఇరవై నాలుగు గంటల చాకిరి చేస్తున్నామా అని మథనపడుతున్నారు. ఇప్పుడు అంగన్వాడి కార్మికులు.. రేపు పారిశుద్ధ్య సిబ్బంది సమ్మె చేస్తే ఆ పని కూడా తమనే చేయమంటారా అని మండిపడుతున్నారు. నిజానికి వాలంటీర్లు, వార్డు సచివాలయ ఉద్యోగులకు గతంలోనే ఇలాంటి పని అప్పచెప్పారు. గుంటూరులో సులభ్ కాంప్లెక్స్ లీజుల కాంట్రాక్ట్ ముగియడంతో వాటి నిర్వహణ … డబ్బుల వసూలు చూసుకోవాలని వార్డు వాలంటీర్లకు విధులు ఇచ్చారు. అందులో లేడీ ఉద్యోగులు కూడా ఉన్నారు. అప్పట్లోనే ఈ అంశంపై దుమారం రేగింది.
సొంత కార్యకర్తలే వైసీపీ వాలంటీర్లు అని ఆ పార్టీ నేతలు చాలా సార్లు ప్రకటించారు. అయితే మాత్రం వాళ్లను ఇలా.. అంగన్వాడి ఆయాలు చేసే పనులు.. పారిశుద్ధ్యం సిబ్బంది చేసే పనులను ఎందుకు ఉపయోగించుకుంటున్నారన్న వేదన వినిపిస్తోంది. జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయని వారు ఉంటే ఎంత పోతే ఎంత అనుకుని .. చివరికి వారికి ప్రత్యామ్నాయంగా వాలంటీర్లను వాడేసుకుంటున్నారు. చివరికి వాలంటీర్లు కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు.