ఉద్యోగుల భుజాలపై తుపాకీ పెట్టి.. పంచాయతీ ఎన్నికలను తప్పించుకోవాలన్న లక్ష్యంతో ఏపీ సర్కార్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం.. అక్కడ ఏ వాదన వినిపించాలన్న ఆంశంపై ఓ నిర్ణయానికి వచ్చింది. అదే ఉద్యోగులు సిద్ధంగా లేరని చెప్పడం. వారు కరోనా కారణంగా ప్రాణ భయంతో ఉన్నారని.. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అంటే.. రెండు నెలల తర్వాత ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారన్న వాదనతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనికి తగ్గట్లుగానే ఉద్యోగ సంఘం నేతలు తమ వాయిస్ సవరించుకున్నారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు అనే ఉద్యోగ సంఘం నేత పరిమితి దాటిపోతున్నారు. తాము చచ్చిపోతున్నామని చెప్పినా పట్టించుకోవడంలేదని ఎస్ఈసీపై నిందలేస్తున్నారు.
ఇతర ఉద్యోగ సంఘాలూ అదే చెబుతున్నాయి. గవర్నర్ కల్పించుకుని ఎన్నికలు నిలిపివేయాలని… లేకపోతే.. తమ తరపున సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా అదే అనుకుంటోంది కాబట్టే.. ఆయన నోటి నుంచి ఆ కామెంట్లు వచ్చినట్లుగా భావిస్తున్నారు. మీడియాతో మాట్లాడిన వైసీపీ నేతలు, మంత్రులు.. చివరికి సింగిల్ హ్యాండ్‌తో అన్నీ నడిపిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రకటించారు. ఉద్యోగులు కూడా ఎన్నికల నిర్వహణ వద్దంటున్నారని చెబుతున్నారు.
మొత్తానికి ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లడం ఖాయమే. అయితే ఇప్పటికే ఇటీవలి కాలంలో స్థానిక ఎన్నికలు ఆపేయాలని దాఖలయిన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు వ్యతిరేక తీర్పు చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఆదేశించింది. దీన్నే గుర్తు చేస్తున్న న్యాయనిపుణులు అక్కడా ఎదురుదెబ్బ తగలడం ఖాయమంటున్నారు. అయితే.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తాము స్వీప్ చేస్తామని. వైసీపీ మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు.