మే ఒకటి నుంచి అందరికీ వ్యాక్సిన్లంటూ హంగామా చేసిన కేంద్రం.. చివరికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా లైట్ తీసుకుంది. వ్యాక్సిన్ కోసం కోట్లలో రిజిస్ట్రేషన్లు ఉంటాయని తెలిసి కూడా.. కోవిన్ యాప్ను కనీసం అప్ గ్రేడ్ చేయలేదు. ఫలితంగా రిజిస్ట్రేషన్ చేయించుకుందామని ఆశపడిన ప్రతి ఒక్కరికి .. యాప్ నుంచి వెక్కిరింతలే ఎదురయ్యాయి. కోవిన్ యాప్.. ఆరోగ్య సేతుతో పాటు పోర్టల్లోనూ అదే పరిస్థితి. కొంత మంది పోర్టల్ ఓపెన్ అయినా… రిజిస్ట్రేషన్ 45 ప్లస్ వారికి మాత్రమే అని చూపించింది. దీంతో ఎంతో హైప్ క్రియేట్ చేసి.. పబ్లిసిటీ గేమ్ ఆడారని తేలిపోయింది. దేశంలో టీకాలు పెద్ద మొత్తంలో అందుబాటులో లేవు.
ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్లు వేస్తున్నారు. వారే వ్యాక్సిన్ కేంద్రాల వద్ద క్యూల్లో నిల్చుకుంటున్నారు. వారికి పూర్తి చేసిన తర్వాత మిగతా వారి గురించి ఆలోచించే అవకాశం ఉండేది. కానీ వారికి ఇవ్వకుండానే… పద్దెనిమిదేళ్లు నిండిన వారికి ఇస్తామంటూ ప్రకటించి హడావుడిగా రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. ఆ రిజిస్ట్రేషన్లు కూడా ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా మారాయి. ఇప్పుడు కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే కోటా కాకుండా.. రాష్ట్రాలు.. సీరం, భారత్ బయోటెక్ వద్ద కొనుగోలు చేసి.. పంపిణీ చేయాలి. ఆయా సంస్థల ఉత్పత్తి కూడా.. ప్రపంచంలోనే జనాభా పరంగా రెండో అతి పెద్ద దేశమైన ఇండియాకు సరిపోదు.
ఇప్పుడున్న ఉత్పత్తి ప్రకారం చూస్తే.. జూన్ తర్వాతనే పద్దెనిమిదేళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. కొన్ని రాష్ట్రాలు నిజాయితీగా ఈ విషయం చెబుతున్నా.. కొన్ని రాష్ట్రాలు మాత్రం.. హడావుడి చేస్తున్నాయి. ఇచ్చేస్తామన్నట్లుగా నమ్మిస్తున్నాయి. దీని వల్ల ఒకటో తేదీ నుంచి గందరగోళ పరిస్థితులు వ్యాక్సిన్ సెంటర్ల వద్ద ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది.