రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలులో భారీ స్కాం జరిగిందని ప్రభుత్వం గట్టిగా అనుమానిస్తోంది. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న నమ్మకం కలగడంతో ఏకంగా విచారణ కోసం న్యాయమూర్తిని నియమించింది. ఈ డీల్ సమయంలో పలువురికి ముడుపులు ముట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీంతో రాఫెల్ ఒప్పందం వ్యవహారం రాజకీయంగా సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది..! ఇదంతా నిజమే.. కానీ నమ్మశక్యంగా లేదు కదూ..! ఎందుకంటే .. మోదీ సర్కార్ … రాఫెల్లో అసలు అవినీతే జరగలేదని కుండబద్దలు కొట్టి వాదిస్తోంది. విచారణ అనే దానికి అసలు అంగీకరించడం లేదు. ఇలాంటి సమయంలో హఠాత్తుగా విచారణకు ఆదేశిస్తుందా.. అన్నది చాలా మందికి వచ్చే సందేహం.
ఇది నిజమే.. రాఫెల్ స్కాంపై విచారణకు ఆదేశించింది ఇండియాలో కాదు.. ఫ్రాన్స్‌లో. ఫ్రాన్స్ నుంచే రాఫెల్ యుద్ధ విమానాలను ఇండియా కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ వెనుక భారీ స్కాం ఉందని చాలా కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫ్రాన్స్‌లోనూ లంచాలు చేతులు మారాయని.. ఇండియాలోనూ అంతేనని ఆరోపణలు వినిపించాయి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని మోదీ సర్కార్ రద్దు చేసుకుని … తక్కువ విమానాలను అత్యధిక రేటు పెట్టి కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. ఇందులో అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్‌ను భాగస్వామిగా చేర్చారు. దీనిపై ఇండియాలో కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కానీ కేంద్రం… క్లీన్ చిట్ ఇచ్చేసుకుంది. ఎన్నో అనుమానాలు మాత్రం తీరకుండానే ఉండిపోయాయి. ఇప్పటికే… జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసి విచారణ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ వస్తోంది.
ప్రస్తుతం ఇండియాలో ఎలాంటి విచారణ జరిగే అవకాశం లేదు.కానీ ఫ్రాన్స్‌లో జరిగిన విచారణలో లంచాలు చేతులు మారినట్లుగా తేలితే మాత్రం.. ఇండియాలోనూ రాజకీయ రచ్చ జరగడం ఖాయం. ఫ్రాన్స్ విచారణ తీరు బట్టి.. దేశంలో రాజకీయాలు కూడా మారే అవకాశాలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ హయాంలో భోఫోర్స్ స్కాం ఎలాగో… మోడీ హయాంలో… రాఫెల్ స్కాం అలా అని.. చాలా మంది విశ్లేషిస్తూ వస్తున్నారు. కేంద్రం .. మొత్తంగా తొక్కేయడంతో బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ డీల్‌పై ఎలాంటి విచారణ జరగదని అనుకున్నారు. కానీ ఫ్రాన్స్ వైపు నుంచి ఓ అవకాశం వస్తోంది. అక్కడ విచారణలు.. ఇక్కడలా ఏళ్ల తరబడి సాగవు కాబట్టి.. త్వరలోనే ఇండియాలోనూ రాఫెల్ రచ్చ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అనుకోవచ్చు.