పిచ్చి ముదిరింది రోకలి తలకు చుట్టమన్నట్లుగా ఏపీ ప్రభుత్వ పరిపాలన సాగుతోంది. గ్రామ వాంటీర్లపై పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనను ప్రాసిక్యూట్ చేయాలని..కోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రభుత్వ జీవో చూసి న్యాయనిపుణులు కూడా విచిత్రంగా చూస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చేసుకోవాలనుకుంటే అరెస్టు చేసుకోవచ్చు.. నోటీసులు జారీ చేసి వివరణ అడగవచ్చు..అదేమీ చేయదల్చుకోకపోతే నేరుగా కోర్టుకు వెళ్లవచ్చు. మధ్యలో జీవో ఇవ్వాల్సిన అవసరం ఏమిటో మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు.
ఇటీవల జీవోలతోనే భయపడతామని ప్రభుత్వం తెలివి తేటలు ప్రదర్శిస్తోంది. సీఐడీ అధికారులు అడిగారో లేదోకానీ.. లెక్కలేసి మరీ ఆస్తుల జప్తు కోసం అనుమతులు ఇస్తున్నట్లుగా ప్రచారం చేయడం.. తర్వాత సీఐడీ కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకోవడం వంటి ప్రహసనాలు చేశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ పై కోర్టుకెళ్లేందుకు కూడా అదే తరహా జీవో జారీ చేశారు. ఈ అంశపై పవన్ కల్యాణ్ ఘాటుగానే స్పందించారు. పంచకర్ల పార్టీలో చేరిన సందర్భంగా చేతనైంది చేసుకో అని సవాల్ చేశారు.
తనను అరెస్ట్ చేసుకోవచ్చని..చిత్రవధ చేసుకోవచ్చని ఇలాంటి కేసులకు భయపడితే తాను పార్టీ ఎందుకు పెడతాననిప్రకటించారు. తనను ప్రాసిక్యూషన్ చేయాలని ప్రభుత్వం జీవో ఇచ్చిందని.. చేసుకోవచ్చని స్పష్టం చేశారు. జగన్ సై అంటే తాను సై అన్నారు. వాలంటీర్లు ఓ ఎనిమిదేళ్ల పాపను రేప్ చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలని ప్రశ్నించారు. ఓ వాలంటర్ తన ఇల్లు రోడ్ వైడెనింగ్లో అన్యాయంగా కూల్చేశారని..తనను కలిసిందని.. తర్వాత నెలకే ఆమె అన్నయ్య అనుమానాస్పదంగా చనిపోయారన్నారు. ఈ కారణంగానే జనవాణిని ప్రారంభించామని పవన్ కల్యాణ్ తెలిపారు. తనను ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇచ్చారని.. మర్డర్లు చేసిన వారికి ప్రాసిక్యూషన్ ఉండదా అని ప్రశ్నించారు. పొరపాటున అత్యాచారాలు జరుగుతాయన్నారు.. వారిని ప్రాసిక్యూట్ చేయరా అని ప్రశ్నించారు. వాలంటీర్లు సేకరించే సమాచారాన్ని ఏ జీవో కింద ప్రైవేటు పరం చేశారు..దానిపై విచారణ జరగాల్సిందేనని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. డేటా చౌర్యం అత్యంత తీవ్రమైన నేరమని.. దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు.
పరిపాలనపై అనుభవం లేని.. నేర్చుకునే ఆసక్తి ఏమీ లేని ఓ సీఎం .. వ్యవస్థలతో ఎలా ఆడుకుంటాడో.. తెలిసేలా ప్రస్తుత వ్యవహారాలు ఉన్నాయన్న ఎగతాళి కాస్త అవగాహన ఉన్న వారి దగ్గర నుంచి వస్తోంది.