హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోన్న కాల్‌మనీ బాగోతంపై ఏపీ, తెలంగాణల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కూడా స్పందించారు. బయట వ్యక్తులనుంచి ఎవరూ రుణాలు తీసుకోవద్దని, ప్రభుత్వ సంస్థలనుంచే తీసుకోవాలని సూచించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని యల్లమందలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడ డంప్ యార్డ్‌కు కూడా శంకుస్థాపన చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్ల లబ్దిదారులతో ముఖాముఖిలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగత మరుగుదొడ్లను అందరూ వినియోగించుకోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మద్యానికి అందరూ దూరంగా ఉండాలని అన్నారు. నరసరావుపేట శతాబ్ది ఉత్సవాలలో పాల్గొనటం కోసం గవర్నర్ గుంటూరు జిల్లాకు వచ్చారు.
మొత్తం మీద గవర్నర్ రబ్బర్ స్టాంప్ లాగా ఉండకుండా సమకాలీన అంశాలపై బాగానే స్పందిస్తున్నారు. ఇవాళ కాల్ మనీ వ్యవహారంపై స్పందించిన ఆయన, నిన్న ప్రైవేట్ ఆసుపత్రుల వ్యాపార ధోరణిపై కూడా తీవ్రంగా విమర్శలు చేశారు. వైద్యపరీక్షల పేరుతో ప్రజలను పీడిస్తున్నారని మండిపడ్డారు. జలుబుకు కూడా బ్రెయిన్ టెస్టులు చేయిస్తున్నారని విమర్శించారు.