కడప జిల్లాపై అనుచిత వ్యాఖ్యలు చేసి దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసిన సోము వీర్రాజుకు హైకమాండ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో అత్యంత వివాదాస్పదమైన కామెంట్లు చేసి పరువు తీస్తూండటంతో ఇక ఆపుకోలేకపోయిన బీజేపీ హైకమాండ్ నేరుగా ఫోన్ చేసి సోముకు తలంటినట్లుగా ఏపీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ హైకమాండ్‌కు కొంత మంది ఫిర్యాదు చేశారు. ఇతర పార్టీల స్పందనలు.. ప్రజాభిప్రాయం కూడా వివరించారు.
దీంతో హైకమాండ్ పెద్దలు కూడా అలా ఎలా మాట్లాడతారని ఆశ్చర్యపోయి క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. శుక్రవారం రాత్రి కూడా వివరణగా ఓ వీడియో విడుదల చేసిన ఆయన ఉదయమే క్షమాపణలు చెప్పారు. పార్టీ హైకమాండ్ ఆదేశం మేరకే బేషరతు క్షమాపణలు చెప్పినట్లుగా ఏపీ బీజేపీలోని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. సోము వీర్రాజు వ్యాఖ్యలు పార్టీలకు అతీతంగా రాయలసీమ వాసుల్లో ఆగ్రహానికి కారణం అయ్యాయి. బీజేపీకి ప్రస్తుతం రాయలసీమలోనే కొంతమంది ముఖ్య నేతలున్నారు.
వారందరూ సోము ప్రకటనతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీకి నష్టం చేసి సోము వీర్రాజు ఏం సాధించదల్చుకున్నారని సీమ నేతలు మండిపడుతున్నారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కోవర్ట్ రాజకీయాలు చేస్తున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోము వీర్రాజు ఇక నుంచి ప్రెస్ మీట్లు పెట్టకపోవచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే కొత్త అధ్యక్షుడ్ని నియమిస్తారని అంటున్నారు.