ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ బాట పట్టారు. ఆయన మూడు రోజుల పాటు ఢిల్లీలో పార్టీ పెద్దలతో చర్చలు జరపనున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండాల్సి ఉంటుందని.. పెద్దల నుంచి సమాచారం రావడంతో.. సోము వీర్రాజుతో పాటు ఇతర పార్టీ నేతలు కూడా ఆశ్చర్యపోయారు. ఏదో పెద్ద డెవలప్మెంట్ ఉండబోతోందని.. అందుకే.. సోము వీర్రాజును మానసికంగా సిద్ధం చేసేందుకు… పార్టీ పరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం ప్రారంభమయింది. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలను చూసేందుకు ఆరెస్సెస్ ఇంచార్జీని ఇటీవల మార్చారు.
గతంలో సతీష్ జీ ఉండేవారు. ఇప్పుడు.. శివప్రకాష్ అనే వ్యక్తి చూస్తున్నారు. ఆయన ఇటీవలి కాలంలో పలు సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాల తర్వాత కూడా పార్టీ నేతల తీరులో మార్పు రాలేదు. దీంతో ఏపీలో పార్టీ బతికి బట్టకట్టాలంటే… ఏం చేయాలో ఆరెస్సెస్ తరపున ఓ కీలకమైన నివేదిక బీజేపీ హైకమాండ్‌కు వెళ్లిందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే మార్పు చేర్పులకు హైకమాండ్ సిద్ధమయిందని చెబుతున్నారు. సోము వీర్రాజు .. ఏపీ బీజేపీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి… బీజేపీలో ఎదుగదల లేకపోగా పూర్తిగా నిర్వీర్యమయ్యే దశకు చేరుకుంది. ప్రభుత్వంపై పోరాడకపోవడం.. ప్రతిపక్షంపైనే పోరాడటం.. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేందుకు కూడా వెనుకాడుతూండటమే కాదు జనసేనతో కలిసి పోరాటంలోనూ విఫలమయ్యారు.
జనసేనను కలుపుకుని పోవడంలో నిరాసక్తతను ప్రదర్శించడంతో.. హైకమాండ్ సీరియస్‌గా ఉందని చెబుతున్నారు. జనసేన వైపు నుంచి కూడా పలు మార్లు.. సోము వీర్రాజుతో పాటు మరికొంత మంది ప్రభుత్వ అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు వెళ్లినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో.. మీడియాతోనూ లడాయి పెట్టుకుని అసలు బీజేపీకి ఏపీలో కవరేజీ రాకుండా చేసుకున్నారు. పార్టీ నేతలకు .. సొంత ఎజెండా ఉందని.. అందుకే బీజేపీ ఎదుగకపోయినా పర్వాలేదని అనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సోము వీర్రాజు ఢిల్లీ నుంచి ఎలాంటి సందేశంతో వెనక్కి వస్తారోనన్న ఉత్కంఠ బీజేపీ వర్గాల్లో ప్రారంభమయింది.