వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌ను సమర్థిస్తున్నామని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. అవినాష్ రెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘించారని అప్రూవర్ దస్తగిరి బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అర్హత ఉందని గత విచారణలో స్పష్టం చేసిన హైకోర్టు గురువారం వాదనలు విన్నారు.
దస్తగిరికి ప్రాణహాని ఉందన్నది నిజమేనని సీబీఐ స్పష్టం చేసింది. హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారని స్పష్టం చేసింది. ఈ బెయిల్ రద్దు పిటిషన్‌ను సమర్థిస్తే.. గతంలో హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లలేదని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంలో బెయిల్ రద్దు చేయాలని సవాల్ చేసే లోపే వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టుకు వెళ్లిందని సీబీఐ తరపు లాయర్ పేర్కొన్నారు. తాము ఆ పిటిషన్ విషయంలో కౌంటర్ దాఖలు చేశామని అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరామన్నారు. తదుపరి విచారణ హైకోర్టు ఎనిమిదో తేదీకి వాయిదా వేసింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి గతంలో తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ ను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలైనా రద్దు మాత్రం కాలేదు. సునీతారెడ్డి కూడా సుప్రీంకోర్టు వరకూ వెళ్లి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరారు. వివేకా హత్య కేసులో అరెస్టయిన నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి ఇటీవలే బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. శివశంకర్ రెడ్డికి బెయిల్ వచ్చిన తర్వాత భాస్కర్ రెడ్డి కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు.