తెలంగాణలో పని చేస్తామని అమ్రపాలితో పాటు నలుగురు ఐఏఎస్లు.. ఏపీలోనే పని చేస్తామని ముగ్గురు ఐఏఎస్లు అన్ని రకాల ప్రయత్నాలు చేసి విపలమయ్యారు. చివరికి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు కొట్టి వేసింది. ఇలాంటి విషయాల్లో తాము ఎలా జోక్యం చేసుకుంటామని ముందు అథారిటీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎక్కడ జాయిన్ అవ్వాలో అక్కడ జాయిన్ అవ్వాలని స్పష్టం చేసింది.
తెలంగాణలో గ్రేటర్ కమిషనర్ గా ఉన్న అమ్రపాలితో పాటు రోనాల్డ్ రాస్, వాకాటి కరుణ, వాణి ప్రసాద్ ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉంది. అలాగే ఏపీ నుంచి గరిమెళ్ల సృజన, శివశంకర్, హరికృష్ణ తెలంగాణలో రిపోర్టు చేయాల్సి ఉంది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు పదేళ్ల కిందట యూపీఎస్సీ రికార్డుల ప్రకారం శాశ్వత నివాసం ఆధారంగా ఏపీ అయితే ఏపీకి..తెలంగాణ అయితే తెలంగాణకు కేటాయించారు. కొంత మంది కాట అమ్రపాలి తమ శాశ్వత అడ్రస్ ను విశాఖగా పేర్కొనడంతో ఆమెను ఏపీకి కేటాయించారు. కానీ ఆమె తెలంగాణలోనే ఉండాలనుకుంటున్నారు. కేటాయింపులపై అప్పట్లో క్యాట్ కు వెళ్లి స్టే ఉత్తర్వులు తెచ్చుకుని తమకు నచ్చిన రాష్ట్రాల్లో కొనసాగుతున్నారు.
తెలంగాణ చీఫ్ సెక్రటరీగా పని చేసిన సోమేష్ కమార్ కు కూడా ఏపీ క్యాడరే కేటాయించారు. ఆయనకు కూడా గతంలో కోర్టు వ్యతిరేక తీర్పు ఇచ్చింది. దాంతో ఆయన సీఎస్ పదవి నుంచి వైదొలిగి ఏపీలో రిపోర్టు చేశారు. తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అదే తీర్పు ప్రస్తుత ఐఎఎస్లకూ వర్తిస్తుంది.