అధికారం ఉందంటే దానర్థం.. తమకు ఇష్టం లేని వారిపై దాడి చేసి పగ తీర్చుకోవచ్చని కాదు.. అడ్డగోలుగా ఏ నిర్ణయం తీసుకున్నా… టార్గెట్ చేసిన వారిని కాస్త ఇబ్బంది పెడతారేమో కానీ.. చివరికి కోర్టుల్లో మొట్టికాయలు తప్పవు. మార్గదర్శి విషయంలో ఏపీ ప్రభుత్వానికి అదే జరుగుతోంది. చిట్ గ్రూపుల్ని మూసి వేస్తూ.. అధికారులు తీసుకున్న నిర్ణయాల్ని హైకోర్టు కొట్టి వేసింది. చిట్ గ్రూపుల్ని కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.
మార్గదర్శిపై వేధింపుల్లో భాగంగా పలు జిల్లాల చిట్స్ అధికారులు కొత్త చిట్స్ కు అనుమతి ఇవ్వడంలేదు. పాత చిట్స్ ను రద్దు చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. అసలు ఏ కారణంతో ఇలా రద్దు చేస్తారో చెప్పలేదు. తమకు అధికారం ఉంది రద్దు చేస్తామని చెప్పకొచ్చారు. ఇది ఖాతాదారుల సహజ న్యాయసూత్రాల ఉల్లంఘనేనని హైకోర్టు తేల్చేసింది. అంటే అధికారులు తప్పు చేసినట్లుగా స్పష్టమయింది. మార్గదర్శిని టార్గెట్ చేయడానికి ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందన్న విషయం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది.
అధికారుల్ని ఇష్టారీతిన ప్రయోగించి తప్పుడు ప్రచారాలు చేయడం దగ్గర్నుంచి .. విచారణ పేరుతో ఇళ్లల్లోకి చొరబడి దృశ్యాలు తీసుకు వచ్చి మీడియా, సోషల్ మీడియాల్లో ప్రచారం చేయడం వరకూ అన్నీ చేశారు. ప్రతీ దశలోనూ అధికార దుర్వినియోగం జరిగింది. ప్రభుత్వం మారితే ప్రతీ అధికారి… నిందితుడిగా మారిపోతారు. ప్రభుత్వ పెద్దల అరాచక ఆలోచనలకు..ఎంతో మంది బలికాబోతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.