అమరావతిలో అసైన్డ్ భూముల పేరుతో గత ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లను స్వాధీనం చేసుకుందామని ప్రయత్నించిన ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఇందుకు సంబంధించి జారీ చేసిన జీవో 316ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాజధాని దళిత రైతులకు ఊరట లభించినట్లయింది. అమరావతి పరిధిలో అసైన్డ్ భూములు కలిగిన రైతులు తమ అవసరాల కోసం వాటిని విక్రయించుకునేందుకు జీవో నంబర్ 41ని గత తెలుగుదేశం ప్రభుత్వం జారీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నంబర్ 41 ను రద్దు చేసి.. దాని స్ధానంలో జీవో నంబర్ 316 విడుదల చేశారు.
ప్రభుత్వం జారీ చేసిన 316వ నెంబర్ జీవో ప్రకారం అసైన్డ్ రైతుల నుంచి భూములు కొనడం చట్ట విరుద్ధం. జీవో ఆధారంగా గతంలో జరిగిన క్రయ విక్రయాలు చట్ట విరుద్ధమని పేర్కొంటూ లావాదేవీలు నిర్వహించిన రైతులకు నోటీసులు జారీ చేసింది. నివాస, వాణిజ్య ఫ్లాట్ల కేటాయింపును రద్దు చేసి, వాటిని ఎందుకు వెనక్కు తీసుకోకూడదో చెప్పాలని, లేకపోతే తమ వద్ద అందుబాటులో ఉన్న ఆధారాల్ని బట్టి ఫ్లాట్ల కేటాయింపు రద్దు చేస్తామని నోటీసుల్లో తెలిపారు.
అసైన్డ్ భూములను ఇచ్చిన వారికి ప్రభుత్వం వారికి రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోను బట్టే తాము క్రయ విక్రయాలు జరిపినట్లు అసైన్డ్ భూముల అమ్మకం దారులు, కొనుగోలుదారులు చెప్తున్నారు. ప్రభత్వం కూడా గుర్తించిందని .. రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చిన తర్వాత ఆ స్థలాలు, పొలాలుల తమవి కావని రద్దు చేయడం చట్ట విరుద్ధమని రైతుల తరపు లాయర్లు హైకోర్టులో వాదించారు. దీంతో 316నెంబర్ జీవోను హైకోర్టు నిలుపుదల చేసింది.