పరిషత్ ఎన్నికలను కన్ను మూసి తెరిచేలోపు పూర్తి చేయాలనుకున్న జగన్మోహన్ రెడ్డి సర్కార్‌కు.. కొత్త ఎస్ఈసీ నీలం సాహ్నికి హైకోర్టు షాక్ ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పులో ఉన్న విధంగా కోడ్ విధించకుండా ఎన్నికలు నిర్వహిస్తున్నందున… పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పరిషత్ ఎన్నికలను నిలిపివేయాలని టీడీపీ సహా అనేక పక్షాలు కోర్టుల్లో పిటిషన్లు వేశాయి. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఎస్ఈసీ ఆదేశాలిచ్చిందన్న అంశాన్ని టీడీపీ హైలెట్ చేస్తూ… ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేసింది. వీటిపై రెండు రోజుల పాటు వాదనలు జరిగాయి. ఆదివారం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసి.. ఈ రోజు ప్రకటించింది.
సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చినట్లుగా ధర్మాసనం నిర్ధారించింది. అందుకే పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. పరిషత్ ఎన్నికల పోలింగ్ ఎనిమిదో తేదీన అంటే… ఎల్లుండి జరగాల్సి ఉంది. ఈ లోపే హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికలన్నీ ఇట్టే నిర్వహించేసి.. ఆ తర్వాత మిగిలిన మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్న వైసీపికి ఇది పెద్ద ఎదురుదెబ్బగానే భావించాల్సి ఉంటుంది. హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్‌కు గానీ.. లేకపోతే.. సుప్రీంకోర్టుకు కానీ.. ఏపీ ప్రభుత్వం వెళ్లే అవకాశం ఉంది.
అయితే.. ఎలా వెళ్లినా.. ఎల్లుండి పరిషత్ ఎన్నికల పోలింగ్ జరిగే అవకాశం లేదని మాత్రం చెప్పుకోవచ్చు. మళ్లీ నిబంధనల ప్రకారం.. నాలుగు వారాల సమయం ఇచ్చి.. ఆ తర్వాత ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. తదుపరి విచారణను పదిహేనో తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. మరో వైపు.. అసలు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేనతో పాటు మరికొంత మంది పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై ఉత్తర్వులు రావాల్సి ఉంది.