పోలీసులు నేరస్తుల్ని పట్టుకుని వారిని కోర్టులో ప్రవేశ పెట్టి.. శిక్షలు విధించేలా చేస్తారు. కానీ ఏపీలో మాత్రం రివర్స్.. కోర్టులు చెప్పిన పని చేయడం లేదని.. కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని… పోలీసులే జైలు శిక్షలకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా విజయవాడ ఏసీపీ శ్రీనివాసరావుకు వారం రోజుల జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా కోర్టును ఏసీపీ తప్పుదోవ పట్టించారని హైకోర్టు మండిపడింది. ఎస్సీ, ఎస్టీ కేసులో ఛార్జిషీట్ వేయాలని ఆదేశించినా ఏసీపీ శ్రీనివాసరావు పట్టించుకోలేదు. దీంతో హైకోర్టు జైలు శిక్ష విధించింది.
ఏసీపీ శ్రీనివాసరావుకు మాత్రమే ఈ పరిస్థితి ఎదురు కాలేదు. అత్యంత సీనియర్ అయిన పోలీసు అధికారుల దగ్గర్నుంచి దిగువ స్థాయి పోలీసు అధికారుల వరకూ అందరిదీ అదే పరిస్థితి. స్వయంగా డీజీపీ .. రూల్ ఆఫ్ లా అమలు చేయడం లేదని పలుమార్లు హైకోర్టు బోనులో నిల్చున్నారు. రాజకీయ కారణాలతో పని చేస్తున్నారని పలువురు ఐపీఎస్‌లపై చర్యలకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఏపీ సర్కార్ వాటిని పట్టించుకుందా లేదా అన్న సంగతి తర్వాత. పోలీసులు అపహరణలకు పాల్పడుతున్నారని రెండు సార్లు సీబీఐ విచారణకు ఆదేశించింది. వాటిపై విచారణ జరుగుతోంది.
కేసుల్ని నీరుగార్చడం.. నిందితుల్ని రక్షించడం… అధికార పార్టీకి చెందిన రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడం… వంటివి పోలీసుల విధిగా మారిందన్న ఆరోపణలు చాలా కాలంగా వస్తున్నాయి. సీఐడీ సునీల్ కుమార్ పై కూడా… కోర్టు ధిక్కార కేసు నమోదయింది. పోలీసు విభాగంలోని ఏ వ్యవస్థ కూడా కోర్టుల్నీ లెక్క చేయని పరిస్థితి ఏర్పడింది. ఇది అన్ని వ్యవస్థల్లోనూ ఉంది. పలువురు ఐఏఎస్‌లపై ఇటీవల కోర్టు ధిక్కార కేసులు నమోదయ్యాయి. కానీ మిగతావి వేరు.. పోలీసు వ్యవస్థ వేరు. పోలీసు వ్యవస్థ కూడా.. న్యాయ వ్యవస్థని ధిక్కరించడం ప్రారంభిస్తే.. అంతకు మించిన అరాచకం.. ప్రజాస్వామ్యంలో మరొకటి ఉండదు.