హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 3 రోజుల్లోగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని హైకోర్ట్ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సూచించింది. రైతుల ఆత్మహత్యలపై దాఖలైన వ్యాజ్యాలపై ఇవాళ హైకోర్ట్‌లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇరు ప్రభుత్వాల తీరుపై కోర్ట్ తీవ్రంగా స్పందించింది. ఆత్మహత్యలను ఆపటానికి ఏమి చేస్తున్నారని ప్రశ్నించింది. ఇరు ప్రభుత్వాల న్యాయవాదులు రైతులకోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయని, కానీ అవి సరిపోవని కోర్ట్ అభిప్రాయపడింది. అధికారుల అవినీతికూడా రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతోందని, అలాంటి అధికారులపై కఠినంగా వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. పాస్ పుస్తకం కావాలంటే రు.2 వేలు, ట్రాన్స్ఫార్మర్ కావాలంటే రు.4 వేలు చెల్లించాలా అని ప్రశ్నించింది.
మహబూబ్‌నగర్ జిల్లాలో రెవెన్యూ, ట్రాన్స్‌కో, ఖజానా శాఖల్లో అవినీతిపై మీడియాలో వచ్చిన కథనాన్ని హైకోర్ట్ సుమోటోగా విచారణకు తీసుకుంది. రెవన్యూ కార్యాలయాల్లో అవినీతిపై తెలంగాణ ప్రభుత్వాన్ని వివరాలు అడిగింది. ప్రొఫెసర్ కోదండరామ్ సూచనలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని టీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. రైతుల ఆత్మహత్యలు పూర్తిగా ఆగిపోవాలన్నదే తమ ఉద్దేశ్యమని తెలుపుతూ, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి వ్యవహారానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.