ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ అధికారులు కేటీఆర్ ను హైకోర్టు తీర్పు వచ్చే వరకూ అరెస్టు చేయడానికి అవకాశం లేదు.కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను విచారించిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేశారు. తీర్పు ప్రకటించే వరకూ అరెస్టు చేయవద్దని ఏసీబీని ఆదేశించారు. ఏసీబీ అధికారులు విచారణ కొనసాగించే అవకాశం ఉంది. తీర్పు ఎప్పుడు ప్రకటించినా అప్పటి వరకూ కేటీఆర్ కు ఏసీబీ అరెస్టు చేసే అవకాశం లేనట్లే.
కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు లాయర్ సిద్దార్థ దవే వాదనలు వినిపించారు. అసలు కేటీఆర్ పై ఏసీబీ కేసు పెట్టే చాన్స్ లేదని ఆయన వాదించారు. ప్రభుత్వం తరపున ఏజీ మాత్రం గవర్నర్ కూడా అనుమతి ఇచ్చారని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని వాదించారు. కీలకమైన కేసుల్ని క్వాష్ చేసిన సందర్భాలు దాదాపుగా లేవు. అయితే కేటీఆర్ మాత్రం ఈ కేసును క్వాష్ చేస్తారని నమ్మకంతో ఉన్నారు. ఈ కేసును క్వాష్ చేస్తే ఈడీ కేసు కూడా ఉండదని అంటున్నారు.
కేటీఆర్ తమ ఎదుట హజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఏడో తేదీన హాజరు కావాలని నోటీసులు పంపింది. అప్పటి లోపు తన కేసును క్వాష్ చేస్తారని.. కేటీఆర్ నమ్మకంతో ఉన్నారు. ఫార్ములా ఈ రేసు కేసు ఉత్తదేనని కేటీఆర్ దాదాపుగా ప్రతీ రోజూ చెబుతున్నారు. తనకు ఒక్క రూపాయి కూడా అందలేదని అంటున్నారు.