ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనను వీకెండ్లో అరెస్ట్ చేస్తుందని తెగ బాధపడిన మాజీ ఇంటలిజెన్స్ చీఫ్, ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు రిలీఫ్ లభించింది. ఆయన విషయంలో రెండు వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తనను వీకెండ్లో అరెస్ట్ చేసి… నలభై ఎనిమిది గంటల పాటు కస్టడీలో ఉన్నట్లుగా చూపించి మరోసారి సస్పెన్షన్ వేటు వేసే కుట్ర చేస్తున్నరని ఆరోపిస్తూ… దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపి ఉత్తర్వులు ఇచ్చింది. రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కు కూడా లేఖ రాశారు. అర్జంట్‌గా ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మీటింగ్ ఏర్పాటు చేస్తే.. తనపై ఏపీ సర్కార్ పన్నుతున్న కుట్రను.. సవివరంగా సాక్ష్యాలతో సహా తెలియచేస్తానన్నారు. అయితే.. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎలాంటి స్పందన వ్యక్తం చేసిందో స్పష్టత లేదు. ఈ లోపు కోర్టు నుంచి మాత్రం ఆయనకు రిలీఫ్ ఇచ్చింది. ఇప్పటికి …దాదాపుగా ఇరవై నెలలుగా ఆయనకు పోస్టింగ్ లేదు. జీతభత్యాలుకూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఇప్పుడు ఆయన న్యాయపోరాటం చివరి దశకు వచ్చింది.
ప్రభుత్వం మొదట్లో ఆయనపై చేసిన ప్రచారానికి ప్రస్తుతం నమోదు చేస్తున్న అభియోగాలకు పొంతన లేదు. రూ. పది లక్షలు ప్రభుత్వం నష్టపోవడానికి కారణం అని ఇప్పుడు చెబుతోంది. అయితే ఆ రూ. పది లక్షలు నష్టపోవడానికి కూడా తాను కారణం కాదని.. సంబంధిత కొనుగోలు కమిటీల్లో తాను లేనని చెబుతున్నారు. ప్రభుత్వం తనపై నమోదు చేసినవన్నీ తప్పుడు ఆరోపణలని ఆయన అంటున్నారు. కోర్టులు కూడా.. నిబంధనల ప్రకారం.. ఆయనపై చేసిన అభియోగాలను నమోదు చేయాలని సూచించింది. ఇప్పుడు… వాటిని చేయలేకపోతే… ఏబీవీ మరింత దూకుడుగా న్యాయపోరాటం చేసే అవకాశం ఉంది. అయితే ఈ లోపే మరోసారి కుట్ర పూరితంగా సస్పెన్షన్ వేటు వేస్తారన్న ఆందోళనతో తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.