ఎందుకో బాలీవుడ్ దృష్టి.. మన పాత తెలుగు సినిమాలపై పడింది. మిథునం, ఛత్రపతి, ఊసరవెల్లి లాంటి సినిమాల్ని వాళ్లు రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు కాస్త ఆలస్యమైనా… మరో హిట్ సినిమా కూడా బాలీవుడ్ కి వెళ్తోందని టాక్. అదే రేసుగుర్రం.
అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన చిత్రం `రేసుగుర్రం`. సురేందర్ రెడ్డి దర్శకుడు. అన్నాదమ్ముల అనుబంధానికి మంచి కమర్షియల్ పాయింట్స్ జోడించి – మాస్‌కి నచ్చేలా తీర్చిదిద్దారు. బన్నీ కెరీర్లో మర్చిపోలేని సినిమా ఇది. సినిమా అంతా ఒక ఎత్తు.. చివర్నో కిల్ బిల్ పాండే గా బ్రహ్మానందం విజృంభణ మరో ఎత్తు. ఇప్పటికీ ఈ సినిమాకి మంచి టీఆర్పీలే వస్తుంటాయి. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ కి వెళ్లనుంది. పెన్ స్టూడియోస్ సంస్థ `రేసుగుర్రం `హక్కుల్ని కొనుగోలు చేసింది. `ఛత్రపతి` సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తోంది కూడా ఈ సంస్థనే. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. నిజానికి.. రేసుగుర్రం, ఛత్రపతి ఈ రెండు రీమేకులూ బెల్లంకొండ ముందుకు వెళ్లాయట. అందులో ఛత్రపతి రీమేక్‌ని బెల్లంకొండ ఎంచుకున్నాడని తెలుస్తోంది. మరి.. రేసుగుర్రాన్ని ఎవరితో పరుగులు పెట్టిస్తారో..??