హైదరాబాద్: సుదీర్ఘ కాలంనుంచి దేశంలో ప్రచురితమవుతున్న దినపత్రికలలో ఒకటైన హిందూ ఆంగ్ల దినపత్రిక, తన 137 సంవత్సరాల చరిత్రలో ఇవాళ మొట్టమొదటిసారిగా ప్రచురణకు నోచుకోలేదు. చెన్నైను ముంచెత్తుతున్న వర్షాలు, వరదల కారణంగా సిబ్బంది ఆఫీసుకు వచ్చే పరిస్థితి లేకపోవటంతో చెన్నై ఎడిషన్ పేపర్‌ను ఇవాళ ప్రింట్ చేయలేకపోయారు. తమ పత్రిక చరిత్రలో ఇదే మొదటిసారని పబ్లిషర్ మురళి బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తమ ప్రింటింగ్ ప్రెస్ భారీ పరిమాణంలో ఉండటంతో నగరానికి 30 కిలోమీటర్ల దూరంలోని మరైమలై నగర్లో కట్టామని, ఇవాళ భారీవర్షాల కారణంగా అక్కడికి ప్రెస్ సిబ్బంది వెళ్ళే పరిస్థితి లేకపోవటంతో ఇలా జరిగిందని తెలిపారు. ఒకవేళ తాము పేపర్ ప్రింట్ చేసినా దానిని పంపిణీ చేసే పరిస్థితి కూడా లేదని చెప్పారు. టైమ్స్ ఆఫ్ ఇండియా, దక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలు మాత్రం తమ ఎడిషన్లను ప్రచురించాయి. అయితే అవి పాఠకులకు చేరాయో, లేదో తెలియదు. సాధారణంగా దినపత్రికలలో, న్యూస్ ఛానల్స్ ఆఫీసులలో ఇలాంటి పరిస్థితి వచ్చినపుడు, ఆఫీసుల్లో ఆ టైమ్‌కు పనిచేస్తున్న సిబ్బందికి రిలీవర్స్ రారుకాబట్టి, పనిచేస్తున్నవారికే అన్ని సౌకర్యాలూ అక్కడే ఏర్పాటు చేసి వారితోనే పని చేయిస్తుంటారు. అయితే హిందూ విషయంలో మాత్రం, మురళి చెప్పినట్లు పేపర్ ప్రింట్ చేసినా డిస్ట్రిబ్యూట్ చేసే వారు ఉండరు కాబట్టి ప్రింటింగ్ అనవసరమైన పనే!