వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి మేలు చేకూర్చే విధంగా వరుస పెట్టి సినిమాలు చేస్తున్న రామ్ గోపాల్ వర్మ తాజాగా “వ్యూహం” అన్న సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి కౌంటర్ గా “ప్రతి వ్యూహం” పేరుతో సినిమా తీయనున్నట్టు ప్రకటించారు జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్. వివరాల్లోకి వెళితే..
ఆమధ్య ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో దాదాపు రెండు గంటలు పైగా భేటీ అయిన రామ్ గోపాల్ వర్మ, వ్యూహం సినిమాకు సంబంధించిన సమాచారం కోసమే జగన్ ని కలిశానని, వైఎస్ఆర్సిపి పెట్టుబడులు ఈ సినిమాకు లేవని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ వైఎస్ఆర్సిపి నేతలే లోపాయికారిగా డబ్బులు సమకూర్చి మరీ వరుస ఫ్లాపులలో ఉన్న రామ్ గోపాల్ వర్మతో వైరి పక్షాలను టార్గెట్ చేయడానికి ఈ సినిమా తీస్తున్నారని, ఎన్నికల్లో వైఎస్ఆర్సిపికి కనీసం నాలుగైదు ఓట్లు ఎక్కువ పడేలా చేయడమే ఈ సినిమా లక్ష్యం అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభిప్రాయపడుతున్న సంగతి కూడా తెలిసిందే. అయితే వ్యూహం సినిమాకు కౌంటర్ గా “ప్రతి వ్యూహం” అన్న సినిమా త్వరలో రాబోతోందని, కేవలం మూడు వారాలలో షూటింగ్ పూర్తయ్యేలా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు జనసేన ప్రతినిధి.
ఆయన ప్రకటన ఇటు మీడియా వర్గాల్లో అటు సినిమా వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. నిజంగా ఈ సినిమా తీస్తున్నారా ఒకవేళ తీస్తే ఎవరు తీస్తున్నారు అంటూ విస్తృత చర్చ జరుగుతోంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం, వ్యూహం సినిమా లాగానే ఈ సినిమా కూడా వైయస్సార్ మరణించిన సంఘటనతోనే మొదలవుతుందని, వ్యూహం సినిమాలో వైయస్సార్ మరణించిన తర్వాత జగన్ పై కాంగ్రెస్ పెద్దలు కుట్ర చేసినట్లుగా చూపిస్తూ ఉండగా, ప్రతి వ్యూహం సినిమాలో మాత్రం వైయస్సార్ మరణించిన వెంటనే జగన్ ఎమ్మెల్యే లతో సంతకాల సేకరణ జరిపిన సంఘటనను హైలైట్ చేస్తున్నారని తెలుస్తోంది. అక్కడ నుండి మొదలు, వైయస్ వివేకానంద రెడ్డి హత్య సమయంలో జగన్ చేసిన విరుద్ధ ప్రకటనలు, అలాగే సొంత కుటుంబ సభ్యులతో విభేదాలు వంటి అంశాలన్నింటినీ ఈ సినిమాలో ప్రస్తావించనున్నారని, జగన్ వ్యక్తిత్వం లో ఉన్న మరోవైపు కోణాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నారని సమాచారం.
ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో సంచలనంగా మారిన ఈ ప్రకటన నిజంగా నిజరూపం దాలుస్తుందా అన్నది వేచి చూడాలి.