కేవలం మూడంటే మూడు రోజుల్లో వంద మిలియన్ డాలర్ల కలెక్షన్లను క్రాస్ చేయడం మామూలు విషయం కాదు. ఉత్తర అమెరికాలో ది జంగిల్ బుక్ ఈ రికార్డును సృష్టించింది. విడుదలైన మొదటి వారాంతంలోనే 103.6 మిలియన్ డాలర్ల కలెక్షన్ల వర్షం కురిపించింది. భారత్ లో అత్యంత పాజిటివ్ రివ్యూ సొంతం చేసుకున్న ఈ సినిమా, అమెరికాలోనూ మోత మోగిస్తోంది. బాక్సాఫీజు వద్ద దుమ్ము రేపుతోంది.
భారతీయ అమెరికన్ నీల్ సేథీ ముఖ్యపాత్రలో నటించిన ఈ లైవ్ యాక్షన్, యానిమేటెడ్ సినిమా కోట్ల మందికి నచ్చేసింది. చివరకు భారత్ లో పాపులర్ తెలుగు, హిందీ హీరోల సినిమాలకు గట్టి పోటీనిచ్చింది. అమెరికాలో అయితే బ్యాట్ మన్ వర్సెస్ సూపర్ మ్యాన్ స్థాయిలో కాకపోయినా ఇంచుమించు ఆ రేంజిలోనే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ విషయంలో బ్యాట్ మన్ వర్సెస్ సూపర్ మ్యాన్, డెడ్ పూల్ తర్వాత జంగిల్ బుక్ దే కొత్త అధ్యాయమట.
ఇక ఏప్రిల్ లో ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ విషయంలో రెండో స్థానం పొందింది. గత ఏడాది ఏప్రిల్ లో విడుదలైన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ తొలి వారాంతంలో 147.2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఆ తర్వాత జంగిల్ బుక్ దే రికార్డ్. ఈ ఏడాది అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఇప్పటికే చోటు సంపాదించేసింది. ఈ బుక్ లో మరో రికార్డుల పేజీ కూడా చేరిపోయింది. భారత్ లో అత్యధిక వీకెండ్ గ్రాస్ కలెక్షన్స్ సాధించిన సినిమా కూడా ఇదేనట.
మోగ్లీ అనే బాలుడి సాహస విన్యాసాలను ఆసక్తికరంగా మలచిన దర్శకుడు జాన్ ఫారో ప్రతిభకు నిదర్శనం ఈ సినిమా. ఆయనే దీనికి సహ నిర్మాత కూడా. బ్రిగమ్ టేలర్ మరో నిర్మాత. బెన్ కింగ్స్ లే వంటి ప్రఖ్యాత సీనియర్ నటుడు దీనికి మరో అదనపు ఆకర్షణ. 175 మిలియన్ డాలర్ల ఖర్చుతో వాల్ట్ డిస్నీ సంస్థ నిర్మించిన ఈ సినిమా ముందు ముందు ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో మరి.