తెలంగాణ ఇప్పటి వరకూ సాఫ్ట్వేర్, ఫార్మా వంటి రంగాలకు ప్రసిద్ధి. ఇతర రంగాల్లో అభివృద్ధి చేయాలని కేసీఆర్ ప్రభుత్వం పట్టుదలగా ప్రయత్నిస్తోంది. అనూహ్యంగా బంగారు ఆభరణాల తయారీ కేంద్రంగా మారే దిశగా అడుగులు వేస్తోంది. బంగారు, వజ్రాభరణాల తయారీకి పెద్ద పెద్ద సంస్థలు హైదరాబాద్‌లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయాలు తీసుకున్నాయి. బంగారు ఆభరణాల దుకాణాలను ప్రపంచవ్యాప్తంగా కలిగి ఉన్న మలబార్ గోల్డ్.. తమ ఫ్యాక్టరీని హైదరాబాద్‌లో పెట్టనున్నారు.
తాజాగా అంతర్జాతీయంగా పేరు ఉన్న క్యాప్స్‌గోల్డ్ అనే సంస్థతో పాటు వజ్రాల ప్రాసెసింగ్‌లో పేరున్న హంటన్ రిఫైనర్స్ సంస్థల ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. తమ ప్రతిపాదనలు సమర్పించారు. మూడు సంస్థలకు ప్రభుత్వం 20 ఎకరాల భూములు కేటాయించాలని కేటీఆర్ నిర్ణయించారు. మరో ఆరు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించాయి. ప్రస్తుతం వాటితో చర్చలు జరుపుతున్నారు. నెలరోజుల్లో ఆ పరిశ్రమలు వస్తాయా రావా..వస్తే ఎంత పెట్టుబడి పెడతాయన్నదానిపై స్పష్టత వస్తుది.
హైదరాబాద్ శివారులో ముత్యాలు, ఆభరణాల తయారీ సంస్థల కోసం ప్రత్యేకంగా సెజ్ ఉంది. గీతాంజలి గ్రూప్ ఓ పరిశ్రమ నిర్వహిస్తోంది. మరికొన్ని యూనిట్లు కూడా ఉన్నాయి. అక్కడే కొత్తగా వస్తున్న పరిశ్రమలను నెలకొల్పే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానంలో 14 ప్రాధాన్య రంగాలలో ఒకటిగా ఈ బంగారు, వజ్రాల రంగాన్నీ గుర్తించింది. ఈ క్రమంలో అనేక రాయితీలు ఇస్తూండటం… తెలంగాణ సర్కార్ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఆసక్తిగా ఉండటంతో పారిశ్రామికవేత్తలూ ముందుకు వస్తున్నారు.