రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం జరుగుతుందో లేదో తేల్చాడనికి కృష్ణాబోర్డు టీం.. బుధవారం పర్యటించనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతంలో పర్యటించి.. నివేదిక ఇవ్వాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఇప్పటికే ఆదేశించింది. అలాగే..తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా.. నేరుగా కేంద్ర జలశక్తి మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆయన కూడా.. కృష్ణా బోర్డు బృందాన్ని సీమ ఎత్తిపోతల ప్రాంతానికి పంపుతామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కృష్ణాబోర్డు… శరవేగంగా స్పందించింది. బుధవారమే అక్కడ పర్యటించాలని నిర్ణయించింది.
నిజానికి అక్కడ పరిస్థితిని గతంలోనే పరిశీలించేందుకు కృష్ణాబోర్డు ప్రయత్నించింది. రెండు సార్లు తేదీలు ఖరారు చేసి ఏపీ సర్కార్ కు సమాచారం ఇచ్చింది. కానీ ఏపీ ప్రభుత్వం అంగీకరించలేదు. రావడం కుదరదని స్పష్టం చేసింది. తాము వస్తామని ఓ సారి గట్టిగా పట్టుబట్టడంతో కరోనా కారణం చెప్పి నిలిపివేయించింది. దీంతో రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతం పరిశీలించడం ఏపీ ప్రభుత్వానికి ఇష్టం లేదని తేలిపోయింది. అయితే ఇ్పపుడు ఎన్జీటీ ఆదేశాల మేరకు అక్కడి ప్రాంతాన్ని పరిశీలించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికే కేంద్ర బలగాలతో రక్షణ ఏర్పాటు చేస్తామని.. షెకావత్ కేసీఆర్‌కు హామీ ఇచ్చారు. దీంతో రేపటి కృష్ణాబోర్డు కర్నూలు పర్యటన కేంద్ర బలగాల పర్యవేక్షణలో జరగనుంది. అక్కడ నిర్మాణాలు ప్రారంభం అయితే.. వీడియోలతో సహా ఎన్జీటీకి రిపోర్ట్ అందించనున్నారు. గతంలోనే స్టే ఇచ్చినా పనులు ప్రారంభించి ఉంటే.. సీఎస్‌ను జైలుకు పంపుతామని ఎన్జీటీ ఇప్పటికే ఆదేశించింది. ఈ క్రమంలో కృష్ణాబోర్డు పర్యటన ఆసక్తికరంగా మారింది.