ఇప్పుడు ఎవరి నోట విన్నా చినజీయర్ స్వామి ఎంతో శ్రమకోర్చి సిద్ధం చేసిన శ్రీరామనగరం గురించే చర్చ. సమతాస్ఫూర్తిని చాటిన శ్రీ భగవద్రామానుజుల అతి పెద్ద పంచలోహ విగ్రహా ఆవిష్కరణ కోసం అత్యంత సంప్రదాయపద్దతిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హోమాలు ప్రారంభించారు. ఐదువేల మంది రుత్వికులు.. ఒకే సమయంలో వేద మంత్రోచ్ఛారణ చేస్తున్నారు. 2200 మంది కళాకారుల ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ వేడుకలకు అంకురార్పణ బుధవారం జరిగింది.
12 రోజుల పాటు జరగనున్న హోమ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ రోజు 144 యాగశాలల్లోని 1,035 కుండాలలో నిక్షిప్తం చేసి హోమాలను ఆరంభించారు. ప్రతీ రోజూ వీవీఐపీ హాజరవుతారు. ఐదో తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ వస్తారు. 7న రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 13న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఇతర వీఐపీలు పాల్గొననున్నారు.
గురువారం సీఎం కేసీఆర్ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తమ కార్యక్రమంగా భావించి ఏర్పాట్లు చేసింది. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వందల మంది కళాకారులు ఈ క్రతువులో పాలు పంచుకుంటున్నారు. కరెంటు సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్‌శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రత్యేక లైన్లనూ ఏర్పాటు చేశారు. 7 వేల మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలీసు సిబ్బంది ఎవరూ పర్మిషన్ లేకుండా యజ్ఞశాల ఆవరణలోకి ప్రవేశించవద్దని కూడా ఆదేశాలిచ్చారు.
మరో పది రోజుల పాటు శంషాబాద్‌లోని ముచ్చింతల్ వెలిగిపోనుంది. ఈ కార్యక్రమాలన్నింటినీ మైహోమ్ గ్రూప్ యజమాని రామేశ్వరరావు దగ్గరుండి చూసుకుటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అక్కడే ఉండి కీలకంగా వ్యవహరిస్తున్నారు.