కర్నాటక రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేత జగదీశ్ షెట్టర్ ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “ముఖ్యమంత్రి సిద్దరామయ్య రెండున్నరేళ్ళలోనే పరిపాలన చేతకాక చేతులు ఎత్తేసారు. రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలను అరికట్టలేక ప్రజల దృష్టిని సమస్యల నుండి మళ్ళించేందుకే టిపు సుల్తాన్ జయంతి ఉత్సవాలను నిర్వహించి, తద్వారా రాష్ట్రంలో మత ఘర్షణలు జరగడానికి అవకాశం కల్పించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య దీనికి నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలి,” అని డిమాండ్ చేసారు.
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వ వైఫల్యం చెందిందని ప్రతిపక్ష నేత జగదీశ్ షెట్టర్ ఆరోపణలు చేయడం పెద్ద విశేషమేమీ కాదు. కానీ ఒక చేత్తో చప్పట్లు కొట్టలేనట్లే, కేవలం ప్రభుత్వ నిర్ణయం కారణంగానే మత ఘర్షణలు జరిగాయని చెప్పడానికి లేదు. బెంగళూరులో జరిగిన అల్లర్లలో కొన్ని హిందూ సంస్థల ప్రమేయం కూడా ఉంది. వారు తమ నిరసనలు తెలియజేయడానికి రోడ్లెక్కినప్పుడు పోలీసులు వారిని నియంత్రించాలని ప్రయత్నించారు. ఆ సందర్భంలోనే వారి మధ్య ఘర్షణ జరిగి కొందరు గాయపడ్డారు. ఒకరు మృతి చెందారు. ఇటువంటి సమస్యలని వీలయినంత త్వరగా అదుపు చేయలేకపోతే మత ఘర్షణలు రాష్ట్రమంతా విస్తరించే ప్రమాదం ఉంది. కనుక పోలీసులు తమ పని తాము చేశారు. నగరంలో ఉద్రిక్తతలు తగ్గించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ జరిగిన ఆ సంఘటనలను రాజకీయం చేసి దాని నుండి రాజకీయ లబ్ది పొందాలని ప్రతిపక్షం ఇంకా ప్రయత్నిస్తోంది. వచ్చే ఎన్నికలలో తమ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రాగానే టిపు సుల్తాన్ జయంతి ఉత్సవాలపై ప్రస్తుత ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని రద్దు చేస్తామని ప్రతిపక్ష నేత జగదీశ్ షెట్టర్ చెప్పడం గమనిస్తే ఆ విషయం అర్ధం అవుతుంది. ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు ప్రజా సమస్యల పరిష్కారం గురించి ఆలోచించకుండా కేవలం అధికారం కోసమే రాజకీయాలు చేస్తుండటం చాలా దురదృష్టకరం.