వైఎస్ ఫ్యామిలీకి రేపట్నుంచి రెండు పార్టీలు ఉండబోతున్నాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరొకటి.. షర్మిలకు చెందిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. వీరిద్దరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డలే. ఓ పార్టీ ఏపీలో.. మరో పార్టీ తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే.. కుటుంబ సభ్యులందరూ రెండు పార్టీల్లో ఉండటానికి అవకాశం లేదు. అయితే జగన్ పార్టీలో ఉండాలి.. లేకపోతే.. షర్మిల టీంలో ఉండాలి. ఎందుకంటే జగన్ అభీష్టానికి వ్యతిరేకంగా షర్మిల పార్టీ పెడుతున్నారు. ఇప్పుడు అన్నాచెల్లెళ్ల మధ్య మాటలు కూడా లేవు. ఒక వేళ షర్మిల పార్టీకి మద్దతు తెలిపితే.. జగన్మోహన్ రెడ్డి వద్ద ఆదరణ దొరకడం కష్టమే.
ఎందుకంటే.. జగన్మోహన్ రెడ్డి నైజం ప్రకారం.. ఆయన వ్యతిరేకులతో కలిసేవారిని ఎప్పుడూ ఆదరించరు. అందుకే ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీలో ఎవరు ఎటు వైపు ఉన్నారన్న చర్చ జరుగుతోంది. ప్రధానంగా అందరి దృష్టి వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మిపై ఉంది. ఆమె గతంలో ఖమ్మంలో జరిగిన షర్మిల పార్టీ సభకు వెళ్లారు. ఇప్పుడు కూడా ఆవిర్భావ సభకు హాజరవబోతున్నారు. ఆమెను తన పార్టీకి తల్లిని గౌరవాధ్యక్షురాలిగా కూడా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అదే సమయంలో ఇతర కుటుంబ సభ్యులు షర్మిల పార్టీ కి మద్దతు తెలుపుతారా లేదా అన్న సందేహాలు ఉన్నాయి. అయితే అత్యధిక మంది వైఎస్ కుటుంబసభ్యులు… షర్మిల వెంట ఉన్నట్లుగా తెలుస్తోంది.
దాదాపుగా నలభై మందికిపైగా ఫ్యామిలీ మెంబర్స్.. షర్మిల పార్టీ ఆవిర్భావ సభలో భాగం అవుతున్నారు. ఈ అంశంపై ఇప్పుడు పులివెందులలోనూ హాట్ టాపిక్ అవుతోంది. తమ ఇంటి బిడ్డ తెలంగాణలో పార్టీ పెడుతున్నారని.. రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇస్తామన్న వాదన వారిలో వినిపిస్తోంది. అయితే.. తమ కుటుంబంలో తాను వ్యతిరేకించిన ఘటనకు ఎక్కువ మంది మద్దతు తెలిపితే.. జగన్కు ఎలా ఉంటుందో అన్న సందేహం చాలా మందిలో ఉంది. మొత్తానికి కుటుంబంలో జగన్ కన్నా ఎక్కువ మద్దతు షర్మిలకు ఉందన్న అభిప్రాయం రేపు పార్టీ ఆవిర్భావ కార్యక్రమం తర్వాత వెల్లడవుతుందని అంటున్నారు.