ఫైవ్ స్టార్ హోటల్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో ఉన్న పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారం ఇప్పుడు అసలు కన్నా కొసరు ప్రచారాలకు ఎక్కువగా ఉపయోగపడుతోంది.ఈ విషయంలో పోలీసులు 142 మంది జాబితా మాత్రం విడుదల చేశారు. తర్వాత తమకు సంబంధం లేలేదన్నాకు. నిర్వాహకులు, ఉద్యోగులు అయిన ముగ్గురిపై కేసులు పెట్టి ఇద్దరినీ అరెస్టు చేశారు . ఎంత మొత్తం డ్రగ్స్ పట్టుకున్నారో… ఎవరికైనా టెస్టులు చేయించారో మాత్రం స్పష్టత లేదు . కానీ మీడియాలో మాత్రం విస్తృత ప్రచారం చేయడానికి కావాల్సిన స్టఫ్ మాత్రం లీకవుతోంది. దానికి మీడియా మరింత మెరుగులు.. ఊహాగాలు అద్ది రచ్చ రచ్చ చేస్తోంది.
ఆ పబ్‌కు 24 గంటలూ నడుపుకునే పర్మిషన్ ఉందట !
తెల్లవారు జామున పబ్‌లో డాన్సులేస్తున్నారంటూ నూట యభై మందిని పోలీసులు పోలీస్ స్టేషన్కుతీసుకు వచ్చారు. అందరిపైనా డ్రగ్స్ ముద్ర వేశారు. నిజానికి వారు డ్రగ్స్ తీసుకున్నారో లేదో ఎవరికీ తెలియదు. పోలీసులకు అనుమానం ఉంటే టెస్టులు చేయించాలి. అదే సమయంలో సమయం ముగిసిపోయిన తర్వాత పబ్‌లో చిందులు వేస్తున్నారని చెబుతున్న కారణం కూడా కరెక్ట్ కాదని తేలిపోయింది. ఆ పబ్‌కు ఇరవై నాలుగు గంటలూ నడుపుకునేందుకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. ఫోర్ స్టార్ ఆ పైన హోటళ్లలో పబ్‌లు ఎక్స్ట్రా ఫీజ్ చెల్లించి ఈ లైసెన్స్ పొందవచ్చు. ఫుడ్డింగ్ అండ్ మింక్‌కు ఈ పర్మిషన్ ఉంది. అంటే.. వారు అక్కడ పార్టీ చేసుకోవడం తప్పు కాదు.
డ్రగ్స్ తీసుకుని ఉంటే పోలీసులు చేయాల్సిన పనులు ఏంటి?
పుడ్డింగ్ అండ్ మింక్‌కు 24 గంటల పర్మిషన్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న అందర్నీ స్టేషన్‌కు తరలించడం పోలీసులు చేసిన తప్పిదం అవుతుంది. అదే సమయంలో అందరూ డ్రగ్స్ సేవిస్తున్నారన్నట్లుగా మీడియాకు తప్పుడు సమాచారం పంపి..వారి ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం చేయడం కూడా పోలీసులు చేసిన తప్పే అవుతుంది. కానీ పోలీసుల తప్పుల్ని ఎవరూ ప్రశ్నించరు. అలా ప్రశ్నిస్తే.. సెన్సేషనలిజం కాదు. ప్రముఖులను టార్గెట్ చేస్తే అది మీడియా అవుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. నిహారిక కావొచ్చు. గల్లా సిద్ధార్థ్ కావొచ్చు.. రేణుకా చౌదరి కుమార్తె కావొచ్చు..హేమ కావొచ్చు..వారిపై డ్రగ్స్ ముద్ర అయితే వేసేశారు. నిజంగా డ్రగ్స్ విషయంలో వారి పాత్ర ఉంటే పోలీసులు నోటీసులు ఇచ్చి వదిలేస్తారా ?. వారి నేరాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తారా ?
కనీస అవగాహన లేకుండా మీడియా ప్రచారం !
ప్రముఖుల పిల్లలు అంటే వాళ్లేదో ఖచ్చితంగా తప్పు చేసి ఉంటారన్న ఓ భావన మీడియాలో గట్టిగా పడిపోయినట్లుగా కనిపిస్తోంది. వారు పబ్‌లో కనిపిస్తే డ్రగ్స్ తీసుకుంటారని… స్టార్ హోటల్లో కనిపిస్తే ఎవరితోనే గడుపుతారని ఊహించేసుకుని రాయడం కామన్‌గా మారిపోయింది. కానీ వారికీ క్యారెక్టర్లు ఉంటాయనే విషయాన్ని మీడియా పూర్తిగా మర్చిపోయింది. డబ్బులున్న ప్రతి ఒక్కరూ డ్రగ్స్ కొంటారా ? వారికి అవగాహన ఉండదా అనే ఆలోచన చేయడం లేదు. ఇప్పుడు హైదరాబాద్‌లో గల్లీగల్లీకో పబ్ ఉంది. పబ్‌కు వెళ్లేవాళ్లంతా డ్రగ్స్ అలవాటు పడినవాళ్లేనా ? ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా వ్యక్తిత్వ హననం ఎందుకు ?
రాజకీయులూ చలి కాచుకుంటున్నారు !
ఫుడ్డింగ్లో ఎంత డ్రగ్స్ బయటపడిందో.. ఎవరు వాడారో.. ఎవరు సప్లయ్ చేశారో తేలలేదు కానీ అప్పుడు రాజకీయులూ బయలుదేరారు. కాంగ్రెస్ నేతలు అయితే కేటీఆర్ డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలని అతిశయోక్తి పోతున్నారు. పబ్‌లన్నీ ఆయనవేనంటున్నారు. బీజేపీ నేతలదీ అటూ ఇటుగా అదే మాట. నిజంగా అధికార ఇన్ ఫ్లయూన్స్ ఉంటే పబ్ పై అలా దాడి చేసే ధైర్యం పోలీసులకు ఉండేదా..? . మొత్తంగా ఎవరికి రియాలిటీ అక్కర్లేదు. అవసరమైన ప్రచారాలు ఉద్ధృతంగా చేసుకోవడమే.. ప్రస్తుతం డ్రగ్స్ కేసు చుట్టూ నడుస్తోంది.