ప్రధానమంత్రిని జగన్ ఎప్పుడు కలిసినా తిరుపతి ప్రసాదంతో పాటు ఓ మంచి విలువైన వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందిస్తూ ఉంటారు. ఆ ఫోటోలు విడుదల చేస్తూ ఉంటారు. అయితే అలాంటి ప్రతిమలు ఇచ్చినందుకు.. జగన్ ఇచ్చే విజ్ఞాపన పత్రాల వల్ల రాజకీయంగా ఆయనకు ఏమైనా లాభం వచ్చిందేమోకానీ రాష్ట్రానికి మాత్రం వచ్చిందేమీ లేదు. చివరికి పోలవరం నిధులు కూడా రావడం లేదు. కానీ జగన్ ఇచ్చిన ప్రతిమల్ని మాత్రం వేలం వేస్తున్నారు. వాటి విలును కూడా ఖరారు చేశారు. ఒక్కో ప్రతిమ విలువ ఇరవై వేలకుపైగానేఉంది. వాటిని ఎవరైనా కొనుక్కోవచ్చు.
ప్రధాని మోదీకి ఒక్క జగనే కాదు.. ఎవరు వెళ్లినా జ్ఞాపికలు ఇవ్వడం సహజమే. ప్రతీ రోజూ ఆయనకు ఇలాంటి మెమెంటోలు వస్తాయి. ఇతర దేశాలకు వెళ్లినా వస్తాయి. అలాంటి వాటిని ప్రధానమంత్రి సిబ్బంది జాగ్రత్త చేస్తారు. ఇవి ఎక్కువై పోవడంతో వేలం వేస్తున్నారు. ప్రత్యేకంగా పీఎం మెమెంటోస్ పేరుతో ఆక్షన్ వెబ్ సైట్ ప్రారంభించారు. అందులో వచ్చినవన్నీ పెట్టారు. సీఎం జగన్ ఇచ్చిన వెంకటేశ్వర స్వామి ప్రతిమలు కూడా ఉన్నాయి. వాటి కింద ఆయన ఇచ్చినట్లుగాపేరు కూడా ఉంది.
ఈ ప్రతిమల్ని వైసీపీ నేతలైనా కొనుక్కోవచ్చు.. లేదా..సామాన్య ప్రజలైనా కొనుక్కోవచ్చు. కేంద్రం ప్రకటించిన వెబ్ సైట్లోకి వెళ్లి ఆ మేరకు.. బిడ్డింగ్ దాఖలు చేస్తే చాలు. ఒక్కరే బిడ్డింగ్ వేస్తే అదే ధరకు ఇస్తారు. ఎవరైనా పోటీకి వస్తే వేలం పాట పెరుగుతుంది. వేలంపాట వివరాలకు http://pmmementos.gov.in వెబ్సైట్లో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2, 2022 వరకు వేలం పాడుకోవచ్చు.