ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రూపురేఖలను మౌలికంగానే మార్చివేయబోతున్నారు. ఆదాయ వ్యయాలు ప్రస్తుతం ప్రధానంగా ”ప్రణాళిక, ప్రణాళికేతర” పద్దులలోనే వుంన్నాయి.రెండు రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాలూ ఈ విధానాన్నే పాటిస్తున్నాయి. ఎపి ప్రభుత్వం ఇక మీదట పద్దుల పేర్లను ”అభివృద్ది, నిర్వహణ” గా మార్చేయనున్నట్టు ఉన్నత స్ధాయివర్గాల ద్వారా తెలిసింది. జమ్ము కాశ్మీర్, రాజస్ధాన్ రాష్ట్రాలు ఇప్పటికే ఈ పద్దతిని అమలు చేస్తున్నాయి. ఉద్యోగుల జీతాలను ఇపుడు నిర్వహణా పద్దులో చూపిస్తున్నారు. ఇకమీదట జీతాల చెల్లింపులను కూడా అభివృద్ధి పద్దులోనే రాస్తారు. యూనివర్సీటీలు, కాలేజీలు, ఆస్పత్రుల నిర్మాణాలకు ప్రభుత్వం ఇచ్చే సొమ్ము ఆయా సంస్ధలకు ఆస్ధిగా మిగిలిపోతోంది. ప్రభుత్వం ఖాతాలో మాత్రం నిరర్ధక వ్యయంగా వుండిపోతోంది. ఇకపై ఇలాంటి ఖర్చుల్ని పెట్టుబడులుగా చూపిస్తారు. ఫలితంగా అవి ప్రభుత్వ ఆస్ధులైపోతాయి. వాటిపై లీజు రూపంలో ఆదాయాలను జమలలో చూపిస్తారు. ఫలితంగా అనుత్పాదక వ్యయాలు, నిరర్ధక ఆస్ధులు ప్రభుత్వ అకౌంట్లలో కనబడవు.
పెట్టుబడి వ్యయం తక్కువగా ఉంటూందన్న ద్రవ్యసంస్ధల కామెంట్లను దృష్టిలో వుంచుకుని ఈ మార్పులు చేస్తున్నారు. బడ్జెట్చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా ఉండాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన ఈ అంశాలన్నీ అన్నిడిపార్టుమెంటుల అధిపతులకు చంద్రబాబునాయుడు స్వయంగా వివరించి సాధకబాధకాలు తెలుసుకోవాలని భావిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు అప్పుల డిమాండును తప్పని సరిగా ప్రజలముందు వుంచాలన్నదే కొత్తతరహా బడ్జెట్ ఆలోచనకు మూలం.వరుసగా నాలుగేళ్లకు సంబంధించిన ప్రతిపాదనలు ఒకేసారి సేకరించి, వాటిని క్రోడీకరిరచడం ద్వారా ఏటా బడ్జెట్ను రూపొందించే ఆలోచన కూడా వుంది.
ఇంతవరకు రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి నేరుగా ప్రతిపాదనలు తీసుకుని, వాటిని అధ్యయనం చేసి బడ్జెట్ కసరత్తు పూర్తి చేసేవారు. ఇప్పుడు బడ్జెట్ను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లాలని, గ్రామీణ, మండల, జిల్లా స్థాయి నుంచి అవసరాలు తెలుసుకుని రాష్ట్ర స్థాయిలో శాఖాపరమైన బడ్జెట్ను తయారుచేస్తారు. అది కూడా నాలుగేళ్లకు ఒకేసారి ప్రతిపాదనలు కోరుతారు. ఒక శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనలను అధ్యయనం చేసి వాటికి కేంద్రం నుంచి ఎంత నిధులు వస్తాయి, ప్రయివేటు భాగస్వామ్యంతో ఎంత వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఎన్ని నిధులు కేటాయించగలదన్న గణాంకాలు సిద్ధం చేసుకుని, రుణాలుగా సేకరించవలసిన మొత్తాల్ని లెక్కతేల్చుకుంటారు. రోడ్లకు బడ్జెట్లో ఏడాదికి రూ.10వేల కోట్లు కావాల్సి ఉంటుందని అంచనా. ఇందుకు 14 ఆర్థిక సంఘం నుంచి కొంత, కేంద్రం వివిధ పద్దుల ద్వారా ఇచ్చే మొత్తం కొంత కలిపి సుమారు రూ. 2 వేల కోట్లు వస్తుందని, మరికొంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కేటాయించినా, మూడు నాలుగు వేల కోట్ల రూపాయల వరకు కొరత ఉంటుందని ఒక ఉదహరణగా ఒక అధికారి ప్రస్తావించారు.
ఈ మొత్తాన్ని ప్రపంచ బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలుగా తెచ్చుకోవాలి. ఇలా వచ్చిన ప్రతిపాదనలను యథాతథంగా అమలు చేయాలంటే పెద్ద మొత్తంలో రుణాలు తేవాల్సివుంటుందని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల ప్రతిపాదనలను ఒకేసారి తీసుకోవడం వల్ల శాఖాధిపతులు కూడా భారీగా ప్రతిపాదనలు సమర్పించే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏటా నాలుగు నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయల అంచనాలతో ప్రతిపాదనలు వస్తుండగా, నాలుగేళ్లకు వచ్చే ప్రతిపాదనలు రూ.25 లక్షల కోట్లు దాటిపోయినా ఆశ్చర్యం వుండదు. ఈ ప్రతిపాదనలను స్క్రూటినీ చేయడం కూడా అధికారులకు తలకు మించిన భారమే అవుతుంది .
”నాకు ఆస్ధులు ఆదాయాలు అప్పులు వున్నాయి. కొత్త అప్పుకావలసి వచ్చింది. బేలెన్స్ షీట్ చూసిన బ్యాంక్ బ్రాంచిమేనేజర్ ఇది మేము లోన్ ఇచ్చే ఫార్మాట్ లోలేదు. వేరేవిధంగా ప్రెజెంట్ చేయండి. మీ ఆడిటర్ తో మార్పులు చేయించి ఫ్రెష్ అప్లికేషన్ తో రండి లోన్ ఇస్తా అన్నారు”
పై ఉదాహరణ చెప్పి ”మన బడ్జెట్ మార్పుకూడా అప్పుతెచ్చుకోడానిక ప్రపంచ బ్యాంక్ అనుకూలతకోసమే కదా అని అడిగినపుడు ” ఖచ్చితంగా అలాగే అనలేను కానీ, ఆ ప్రయోజనం కూడా వుందని చెప్పగలను” అని ఈ సమాచారం ఇచ్చిన అధికారి వ్యాఖ్యానించారు.