పెగాసస్ స్పైవేర్‌ను ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసింది…వాడింది మోడీ సర్కారేనని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. అసలు ఈ స్పైవేర్ ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరు దుర్వినియోగం చేశారో న్యూయార్క్ టైమ్స్ పరిశోధిచింది. అందులో ఇండియాలో మోడీ సర్కార్ కొన్నదని తేల్చింది. ఎప్పుడు కొన్నది.. ఏ ఖాతాలో కొన్నది కూడా వివరించింది.నరేంద్రమోడీ 2017లో ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల పాటు పర్యటించారు. ఆ పర్యటనలో రెండు బిలియన్ డాలర్ల విలువైన రక్షణ పరికరాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారు.
ఇందులోనే పెగాసస్ స్పైవేర్ కూడా ఉంది. అంటే ప్రత్యేకంగా స్పైవేర్ అని చెప్పకుండా రక్షణ పరికరాల కేటగిరిలో చేర్చి కొనుగోలు చేసి రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించారన్నమాట. పెగాసస్‌తో 300 మందికి పైగా భారతీయులపై నిఘా పెట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిశోర్, అభిషేక్ బెనర్జీ, పలువురు కేంద్రమంత్రులు, జర్నలిస్టులు, సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి.
కానీ నిజం ఏమిటో ఇప్పటి వరకూ తేలలేదు. పెగాసస్ స్పైవేర్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై ప్రస్తుతం సుప్రీంకోర్టు స్వతంత్ర నిపుణుల కమిటీతో దర్యాప్తు నిర్వహింపచేస్తోంది. స్వతంత్ర దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే కేంద్ర ప్రభుత్వం విచారణకు అంగీకరించలేదు. దేశ భద్రత పేరు చెప్పి సమాచారాన్ని ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో సుప్రీంకోర్టు స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించింది.