తెలంగాణకు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్నాయి. తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ ఆయా గ్రామాల ప్రజలు చాలా కాలంగా డిమాండ్లు చేస్తున్నారు. ర్యాలీలు నిర్వహించి అక్కడి కలెక్టర్‌కు వినతి పత్రాలు ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కూడా కలిశారు. ఇప్పుడు కర్ణాటకలోని రాయచూర్ ప్రజలు కూడా అదే ఆలోచనతో ఉన్నారు. రాయచూర్‌కు బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఇటీవల ప్రజలతో మాట్లాడారు.
ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని తెలంగాణలో విలీనం అవ్వాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ప్రజలు కూడా ఈ అభిప్రాయానికి మద్దతు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు పొరుగు రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల వారిని బాగా ఆకట్టుకున్నాయి. రాయచూర్ బెంగళూరుకు దూరంగా.. హైదరాబాద్‌కు దగ్గరగా ఉంటుంది. రాయచూర్ ప్రజలంతా ఏ పని మీదైనా హైదరాబాద్‌కే వస్తూంటారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపోక మందు నైజంలో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు.. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు భాగంగా ఉండేవి. అయితే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటయిన తర్వాత నిజాం సంస్థానంలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రాలో.. కన్నడ మాట్లాడే ప్రాంతాలను కర్ణాటకలో కలిపారు. సరిహద్దుల ప్రకారం విడిపోయినా ఆయా ప్రాంతాలు ఒకప్పుడు నైజాం సంస్థానంలోనివే. అందుకే వారికి తెలంగాణతో మానసిక బంధం ఉంటుంది.