హైదరాబాద్: హైదరాబాద్ జుబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 36లో – భారీ దోపిడీలకు స్కెచ్ వేస్తున్న ఒక అంతర్ రాష్ట్ర దొంగలముఠా నిన్న సినీ ఫక్కీలో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తమ పోలీసులు మంచి ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి ప్రదర్శించారని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. అసలు ప్రాణాలకు తెగించి దొంగలను వెంటాడి పట్టుకున్న ఎల్ అండ్ టీ కూలీలను కనీసం ప్రస్తావించలేదు.
అసలు నిన్న జరిగినదేమిటంటే, కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన దొంగలముఠా మాదాపూర్ ప్రాంతంలో దోపిడికి పథకం వేసినట్లు టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందటంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడ మాటువేశారు. ముఖాలకు మాస్కులు, హెల్మెట్లు పెట్టుకున్న ఐదుగురు యువకులు రెండు బైకులపై కనిపించారు. తాము వెతుకుతున్న దొంగలు వీరేనని నిర్ధారించుకున్న పోలీసులు మఫ్టీలో అనుసరించారు. వారిని గమనించిన దొంగలు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని వెంబడించిన పోలీసులు రోడ్ నంబర్ 36లో నీరూస్ షోరూమ్ వద్ద ఒక బైక్‌ను ఆపగలిగారు. తప్పించుకునే ప్రయత్నంలో బైక్ మీద ఉన్న ఇద్దరు దొంగలు పోలీసులతో పెనుగులాడారు. వారిలో ఒకరైన ఫయీమ్ తన తుపాకితో కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ అటుగా మెట్రో కార్మికులతో వెళుతున్న ఓ డీసీఎమ్ వాహనంవైపుకు దూసుకెళ్ళింది. వాహనంలో వెనకవైపు కూర్చున్న ధర్మేందర్ సింగ్ అనే కూలీ ఛాతీలోకి దిగింది. ఈ కార్మికులు మెట్రో రైల్ నిర్మాణపనులు చేస్తూ మధ్యాహ్న భోజనంకోసం జుబ్లీహిల్స్ నుంచి వస్తున్నారు. తమ సహచరుడిని కాల్చాడన్న ఆగ్రహంతో ఆ వాహనంలో ఉన్న 11మంది కూలీలు ధైర్యాన్ని ప్రదర్శించి కిందకు దూకి ఫయీమ్‌ను, అతని సహచరుడు ఖదీర్‌ను పట్టుకున్నారు. వారినుంచి రెండు దేశవాళీ తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. వారిని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించి తప్పించుకున్న మరో ముగ్గురిగురించి ఆరా తీసి వారిచ్చిన సమాచారంతో షమీమ్ అనే మరొకరినికూడా పట్టుకున్నారు.
ఈ మొత్తం ఉదంతంలో ప్రాణాలకు తెగించింది, ధైర్య సాహసాలు ప్రదర్శించింది కూలీలు. వారు లేకపోతే ఆ దొంగలు ఎలాగోలా తప్పించునేవారనటంలో సందేహంలేదు. అయితే ఆ విషయం అక్కడ స్పాట్లో ఉన్నవారికి మాత్రమే తెలుసు. మన పోలీస్ బాబాయిలు మాత్రం ఇదంతా తమ ప్రతిభేనని జబ్బలు చరుచుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టుకుని డబ్బా కొట్టుకుంటున్నారు. అయితే పోలీసులను ఒకదానికి మెచ్చుకోవాలిలెండి. దొంగలు పట్టుబడటానికి కారణమైన కూలీ ధర్మేంద్రసింగ్కు మంచి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్నారు.