గుడివాడలో గోవా తరహా క్యాసినోలు నడుస్తున్నాయని రెండు రోజుల నుంచి మీడియా.. సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. క్యాసినోలో పెద్ద ఎత్తున అశ్లీల నృత్యాలు కూడా చేస్తున్నారని వీడియోలు బయటకు వచ్చాయి. కానీ పోలీసులు మాత్రం ఇంత వరకూ అటు వైపు కన్నెత్తి చూడలేదు. కోడిపందెలంటే పండుగ మూడు రోజుల పాటు చూసీ చూడనట్లుగా ఉంటారు.. కానీ ఏకంగా కేసినోలు ఏర్పాటు చేస్తే కూడాపోలీసులు పట్టించుకోకపోవడం .. వీడియోలు బయటకు వచ్చినా స్పందించకపోవడం ప్రజలందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఇదేం పోలీసింగ్ అని నివ్వెరపోయేలా చేస్తోంది.
ఆ కేసినోలు మొత్తానికి వైసీపీ రంగులు వేశారు. లైటింగ్లుకూడా అదే పెట్టారు. అదే పెద్ద లైసెన్స్ అనుకున్నారేమో కానీ.. పోలీసులు మాత్రం వాటి జోలికి పోవడానికి ఏ మాత్రం సాహసించడం లేదు. గతంలో ఓ సారి గుడివాడ నియోజకవర్గంలో చెరువు కట్టలపై పేకాట క్లబ్లను నిర్వహిస్తూండగా పోలీసులు పట్టుకున్నారు. అప్పుడు పెద్ద రచ్చ అయింది. ఆ… అమవుతుంది.. వంద రూపాయలు ఫైన్ కట్టి వస్తామంటూ మంత్రి కొడాలి నాని చాలా తేలికగా మాట్లాడారు.
ఇప్పుడు అలాంటి ఫైన్ కట్టించాడనికి కూడా పోలీసులు ఏ మాత్రం సిద్ధంగారు. శాంతిభద్రతలు.. అసాంఘిక కార్యకలాపాల విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శల పాలవుతోంది. అధికార పార్టీ నేతలు హత్యలు చేసినా… అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కనీసం కన్నెత్తి చూడకూడదన్న నిబంధన వారికి అమలవుతోందన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలా అయితే పోలీసు వ్యవస్థ తీరుపై ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే.. అంత కన్నా ప్రజాద్రోహం ఇంకేమీ ఉండదు.