అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై రాయి విసిరిన యువకుడ్ని పట్టుకున్నారు. ఎందుకు రాయి వేశావంటే… క్వార్టర్ బాటిల్, రూ. 350 ఇస్తామని యాత్రకు తీసుకొచ్చారని.. కానీ క్వార్టర్ బాటిల్ ఇచ్చి డబ్బులివ్వకుండా వెళ్లిపోయారని..అందుకే కోపం వచ్చి రాయి విసిరానని ఆ యువకుడు చెప్పాడని.. పోలీసులు మీడియాకు లీకులు ఇచ్చారు.
ఈ విషయం హైలెట్ అయింది. నారా లోకేష్ ట్వీట్లో జగన్ ను ఎద్దేవా చేశారు. డబ్బులు ఇవ్వకపోతే మండదా చెల్లి.. మండదా అక్కా అంటూ.. జగన్ ప్రసంగం స్టైల్ ను హేళన చేస్తూ ట్వీట్ చేశారు. పోలీసుల నుంచి వచ్చిన లీక్ కావడంతో .. సాక్షి మీడియా కూడా అది అబద్దమని చెప్పలేకపోయింది. కానీ పార్టీ నేతలతో మాత్రం కుట్ర అనే ప్రకటనలు చేయిస్తోంది.
ఆ మైనర్ యువకుడికి.. వారి కుటుంబానికి ఏమైనా రాజకీయ సంబంధాలు అంటగట్టే పనుల్లో ఉన్నారేమో కానీ.. పోలీసులు మాత్రం తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటారు. తప్పుడు పనులు చేసి..ఈ ఘటనకు లేనిపోని రాజకీయం పూస్తే వచ్చే ప్రభుత్వం ఊరుకోదు.. అందుకే.. ముందుగానే పోలీసులకు లీకులిచ్చారు. విచారణను ఖచ్చితంగా వీడియో తీసి ఉంటారు కాబట్టి రికార్డుల్లో కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.