చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఆరోపణలతో ముద్రించిన పుస్తకాలను వైసీపీ అద్యక్షుడు జగన్ ఢిల్లీలో పంచిపెడుతున్నారనే వార్త ఆసక్తికరమైంది. వీటిని ఎవరు ఏ మేరకు చూస్తారనేది పక్కనపెడితే ప్రచారానికి రాజకీయ దాడికి మంచి ఆయుధాలుగా ఉపకరిస్తాయి. తెలుగునాట రాజకీయాల్లో ఈ పుస్తకాల యుద్ధం గురించి కొన్ని విషయాలు నాకు గుర్తుకు వచ్చాయి.
జగన్ సిబిఐ కేసు విచారణలో ఖైదీగా వున్నప్పుడు తల్లి విజయలక్ష్మమ్మ ఢిల్లీలో పెద్దలను కలిసి మద్దతు కోరడానికి కార్యక్రమం తీసుకున్నారు. అయితే ఈ లోగానే తెలుగుదేశం బృందం మొత్తం సమాచారంతో సిద్ధమైంది. వాటిని ముందే అన్ని పార్టీలకు అందించాలని భావించారు. దానికి సంబంధించిన కొన్ని వివరాలు కూడా మీడియా ప్రసారం చేసింది. ఈ చర్యతో మీరు జగన్‌కు మరింత ప్రచారం కల్పించబోతున్నారని ఒకరిద్దరు తెలుగుదేశం నేతల దగ్గర వ్యాఖ్యానించాను. అప్పటికే రోజూ ఉదయాన్నే ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో జగన్‌పై ఒకటికి రెండు మీడియా కాన్ఫరెన్సులు జరుగుతుండేవి. ఇవి చాలక ఢిల్లీలోనూ జగన్ ఫోబియాను ప్రదర్శిస్తారా అని అడిగాను. మొత్తానికి ఆ ఆలోచన మానుకుని వూరికే వెళ్లి కలసి వచ్చారు. 2009 ఎన్నికల్లో వైఎస్‌పై ‘రాజా ఆప్ కరప్షన్’ పుస్తకం తెలుగుదేశం ఢిల్లీలోనూ మీడియాలోనూ పంచింది. అయినా ఆయన విజయం సాధించారు.
ఇంకొంచెం వెనక్కువెళితే చంద్రబాబు నాయుడు హయాంలో సిపిఎం ప్రచురించిన ‘బాబు జమానా అవినీతి ఖజానా’ పుస్తకం తరచూ ప్రస్తావనకు వస్తుండేది. 2004 ఎన్నికలలోనే గాక తర్వాత కూడా కాంగ్రెస్ వారు దాన్ని పునర్ముద్రణ చేసి వినియోగించుకున్నారు. నిజానికి ‘లాటీ లూటీ కాంగ్రెస్ సర్కార్’ పేరుతో వైఎస్ పాలనపైనా సిపిఎం పుస్తకం ప్రచురించినా తెలుగుదేశం అంతగా వినియోగించుకోలేదు. చంద్రబాబు నాయుడు టీం విషయాలు బాగా సేకరిస్తుందని పేరుంది. వారు కష్టపడి పోగు చేస్తుంటారు కూడా కాని వైఎస్ టీం కూడా ఎక్కడెక్కడి విషయాలు పోగు చేసి ఉపయోగించుకోవడం వాస్తవం. ఈ రాజకీయ పుస్తకాల యుద్ధం పునరావృతమవుతుందేమో చూడాలి.