స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన 100 రహస్య ఫైళ్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. నేతాజీ విమాన ప్రమాదానికి సంబంధించి అనేక వివరాలు ఈ ఫైళ్లలో ఉన్నాయి. అయితే, వీటన్నింటిలో ఒక్క లేఖ మాత్రం కాంగ్రెస్ ను ఇరుకున పెట్టింది. ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రాసిన ఆ లేఖలో నేతాజీని యుద్ధ నేరస్తుడు అని సంబోధించారు.
దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఇది నిజమైన లేఖ కాదని, ఫోర్జరీ అని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ ఆరోపించారు. నెహ్రూను బద్నాం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నెహ్రూ మహా నాయకుడని శర్మ కితాబిచ్చారు. నేతాజీ గురించి నెహ్రూ అలాంటి పద ప్రయోగం చేశారంటే నమ్మలేమని చెప్పారు. మోడీ మొదటి నుంచీ నెహ్రూను ఘనమైన వారసత్వాన్ని తుడిచేయడానికే ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇంతకీ నేషనల్ ఆర్కివ్స్ లో భద్రపరిచిన ఆ లేఖ నిజమైందా లేక ఫోర్జరీనా అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
మొదటి నుంచీ నెహ్రూ అంటే మోడీకి ఇష్టం లేదంటోంది కాంగ్రెస్. మొదటి నుంచీ నేతాజీ అంటే నెహ్రూకు పడదని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. నేతాజీ ఒక స్వామీజీ రూపంలో అయోధ్య సమీపంలో ఉన్నారనే సమాచారం రాగానే నెహ్రూ గూఢచారులను పంపారని కూడా ఆ రోజుల్లో వార్తలు వచ్చాయి. నేతాజీ కుటుంబ సభ్యులపై నిఘా పెట్టించారనే ఆరోపణలు వచ్చాయి. పలువురు నేతాజీ వారసులు కూడా ఈ వార్తలు నిజమేనని చెప్పారు. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, తర్వాత నేతాజీ బయటకు వచ్చారు. నెహ్రూ మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగారు. నేతాజీ కరిష్మా తన పాపులారిటీని తగ్గిస్తుందనే అని నెహ్రూ భయపడే వారని పలువురు చరిత్రకారులు అనేక సందర్భాల్లో చెప్పారు.
ఇప్పుడు మోడీ విడుదల చేసిన పత్రాల్లో ఉన్న ఆ ఒక్క లేఖపై దుమారం రేగింది. ఇది నెహ్రూను అపఖ్యాతి పాలు చేయడానికి జరిగిన కుట్ర అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఫోర్జరీ పత్రం విడుదల చేసినందుకు కోర్టులో దావా వేస్తామని కూడా కొందరు కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. మొదటి నుంచీ స్వాతంత్ర్య పోరాటం అంటే గాంధీ, నెహ్రూ అనే విధంగా కాంగ్రెస్ జమానాలో చరిత్ర పాఠాలను రూపొందించారు. నేతాజీ సహా అనేక మంది సమరయోధుల గొప్పతనాన్ని, త్యాగాలను గుర్తించలేదనే విమర్శలు కొన్ని దశాబ్దాలుగా వినవస్తూనే ఉన్నాయి. మోడీ ప్రధాని కాగానే పటేల్, నేతాజీలకు ప్రాధాన్యం లభించడం కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదు. ఇప్పుడు నేతాజీ ఫైళ్లపై తాజా దుమారం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.