రాష్ట్రపతి పదవికి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విపక్ష పార్టీల తరపున బలమైన అభ్యర్థిని నిలబెడతామంటూ మమతా బెనర్జీ చేస్తున్న హడావుడి తేలిపోయింది. ఆమె అనుకున్న ముగ్గురు అభ్యర్థులు తాము పోటీ చేసేది లేదని తేల్చి చెప్పారు. శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీలు తాము పోటీ చేయలేమన్నారు. దీంతో మరో అభ్యర్థి లేకుండా పోయినట్లయింది. మరో వైపు సోనియా గాంధీ ఆస్పత్రి పాలయ్యారు. రాహుల్ గాంధీని విచారణ పేరుతో ఈడీ ఆఫీసులోనే ఉంచుతున్నారు. ఇతర ప్రాంతీయ పార్టీలు బీజేపీ ను దాటి ఇతర అభ్యర్థికి మద్దతిచ్చేందుకు సిద్ధంగా లేవు.
ఇలాంటి పరిస్థితుల్లో విపక్షాల కూటమి అభ్యర్థిని నిలబెట్టడం సాధ్యమయ్యే అంశంగా కనిపించడం లేదు. మరో వైపు బీజేపీ తరపున అభ్యర్థి ఎవరన్నది కూడా తేలలేదు. కానీ మోదీ, షాలు ఇప్పటికే అభ్యర్థిపై ఓ అంచనాకు వచ్చి ఉంటారని అందరికీ ఓ క్లారిటీ ఉంది. కానీ ఆ అభ్యర్థి ఎవరన్నది బయటకు తెలియడం లేదు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా … ఇంకా సూచనలు రాలేదు. రాష్ట్రపతి ఎన్నికల కోసం బీజేపీ కమిటీ నియమించింది. ఏకగ్రీవం కోసం రాజ్ నాథ్ సింగ్ ప్రయత్నం చేస్తున్నారు.
పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఎక్కువ మంది పోటీకి ఆసక్తి చూపించడం లేదు. ఈ కారణంగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతివ్వకపోయినా ఎన్నికను బహిష్కరించడం మేలని ఇతర పార్టీలు భావించే అవకాశం కనిపిస్తోంది. పోటీ జరగాలని అనుకుంటే మాత్రం ఎవరో ఒకర్ని నిలబెట్టే అవకాశం ఉంది. రాష్ట్రపతి రేంజ్ అభ్యర్థి కాకపోతే మాత్రం విపక్షాలకు పరాభవం ఎదురవుతుంది.