అచ్చెన్నాయుడును అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా వేటు వేస్తారన్న ప్రచారం తేలిపోయింది. ప్రివిలేజ్ కమిటీ ముందు ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. స్పీకర్‌పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. ఒక వేళ తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే వెనక్కి తీసుకుంటానని చెప్పారు. ఆ సమయంలో అచ్చెన్నాయుడు పేరుతో వచ్చిన ప్రెస్ నోట్ విషయంలో ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తాను దాన్ని రెడీ చేసి ఆఫీసులో ఉంచానని తనకు తెలియకుండానే బయటకు వచ్చిందని వివరణ ఇచ్చారు.
ఈ అంశంపై ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటున్నానని అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారని తెలిపారు. తాను ప్రెస్‌నోట్ ఆఫీసులో పెడితే తన సంతకం లేకుండానే రిలీజ్ అయిందని చెప్పారన్నారు. పొరపాటు జరిగిందని అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారని ఈ వివాదాన్ని తాను పొడిగించదల్చుకోలేదని.. తన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటున్నానని అచ్చెన్న చెప్పినందున వివరణను మిగిలిన సభ్యులకూ పంపుతామన్నారు.
సభ్యుల అభిప్రాయాల మేరకు అచ్చెన్నపై విషయాన్ని ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. వ్యక్తిగతంగా హాజరు కావడానికి గతంలో అచ్చెన్న నిరాకరించారు. అయితే ఈ సారి మాత్రం హాజరై వివాదానికి ముగింపునివ్వాలనుకోవడంతో సాఫీగాసమావేశం జరిగిపోయింది. సాధారణంగా అసెంబ్లీలో ఎలాంటి వివాదాలు వచ్చినా క్షమాపణ లేదా విచారం వ్యక్తం చేయడంతో ముగిసిపోతాయి. అచ్చెన్న వివాదం కూడా అలాగే ముగిసింది.