ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి అరాచక పర్వం ఆవిష్కృతమైంది. త్రేతాయుగంలో శ్రీ కృష్ణుడు నడయాడిన నేలపై ఇప్పుడు ల్యాండ్ మాఫియా రాజ్యమేలుతోంది. ఒకటీ రెండూ కాదు, 280 ఎకరాల ఖరీదైన ప్రభుత్వ స్ధలాన్ని ఓ సంస్థ పేరుతో కబ్జాచేశాడు మాఫియా సూత్రధారి. అక్కడ కబ్జాలను తొలగించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించడంతో అధికారులు పోలీసుల రక్షణ కోరారు. అక్కడ పరిస్థితిని అంచనా వేయడానికి వెళ్లిన పోలీసులపై మాఫియా మనుషులు కాల్పులు జరిపారు. గ్రెనేడ్లు విసిరారు. రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడుల్లో ఎస్పీ, ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.
పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఇరువర్గాల ఘర్షణలతో యుద్ధ వాతావరణం ఏర్పడింది. అదే సమయంలో, గ్యాస్ సిలిండర్, పేలుడు పదార్థాలు ఉంచిన ఓ ఇంటికి దుండగులు నిప్పంటించారు. దీంతో ఆ ఇల్లు పేలిపోయింది. మంటలు ఎగసిపడ్డాయి. అలా మంటల్లో, పోలీసు కాల్పుల్లో మొత్తం 22 మంది స్థానికులు మరణించారు.
ఇదేదో మామూలు భూకబ్జా వ్యవహారం కాదు. పక్కా స్కెచ్ తో చేసిన భూదందా. ఇవాళ హటాత్తుగా జరిగిన కబ్జా కాదిది. చాలా కాలంగా కబ్జాదారు చెరలో ఉంది. రాజకీయ అండ లేకుండా ఇంత పెద్ద ఎత్తున కబ్జా చేయడం సాధ్యం కాదనేది బీజేపీ వాదన. ఈ కబ్జాకాండ సూత్రధారికి మద్దతిచ్చే పార్టీ ఏమిటో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం జవాబు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.
ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలమని ముఖ్యమంత్రి చెప్పారు. విచారణ సరే. కాల్పుల తర్వాత పోలీసులు ఆ ప్రాంతంలో జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున ఆయుధాలు లభించాయి. తుపాకులు, గ్రెనేడ్లు, తల్వార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే అక్కడ కబ్జా మాఫియా ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. పరిశీలనక వెళ్లిన పోలీసులపై అమానుషంగా విరుచుకు పడిన వారు ఎవరనేది తెలియాలి. కబ్జాదారుతో పాటు అక్కడి సంఘవిద్రోహ శక్తుల వివరాలను కూడా బయటపెట్టాల్సిన అవసరం ఉంది.
అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో, మథురలో ల్యాండ్ మాఫియా ఇష్టారాజ్యం నడుస్తోందని దీన్ని బట్టి అర్థమవుతోంది. చాలా కాలంగా దందాలు నడుస్తున్నా పోలీసులు పట్టించుకోలేదా? పైనుంచి ఏమైనా ఒత్తిళ్లు వచ్చాయి? ఏ పార్టీ అండతో కబ్జా సూత్రధారి ఇష్టారాజ్యం చెలాయిస్తున్నాడనే ప్రశ్నలకు ప్రభుత్వం జవాబు చెప్తుందో లేదో చూడాలి.