ప్రభాస్ – మారుతి కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమా ‘రాజాసాబ్’. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో మొదలైంది. అయితే ప్రభాస్ కాల్షీట్లు అనుకొన్న స్థాయిలో దొరక్కపోవడంతో మెల్లమెల్లగా షూటింగ్ జరుపుకొంటూ వచ్చింది. ఇప్పుడు ‘రాజాసాబ్’ చిత్రీకరణ తుది దశకు చేరుకొన్నట్టు సమాచారం. ఈ డిసెంబరు నాటికి దాదాపుగా షూటింగ్ పూర్తి చేయాలన్న ధ్యేయంతో ఉన్నాడు మారుతి. ప్రస్తుతం హైదరాబాద్ లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ కూడా చిత్రీకరణలో పాలు పంచుకొంటున్నారు. త్వరలోనే యూరప్ లో పాటల్ని తెరకెక్కిస్తారు.
ఈ క్రిస్మస్ సందర్భంగా ‘రాజాసాబ్’ టీజర్ విడుదల చేసే ఆలోచనలో ఉంది చిత్రబృందం. జనవరిలో సంక్రాంతి కానుకగా ఓ మాస్ పాట రిలీజ్ చేస్తారట. ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రూపొందించింది. దాదాపు రూ.350 కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. మరో రూ.30 కోట్ల వరకూ ప్రమోషన్లకు కేటాయించే అవకాశం ఉంది. అంటే రూ.400 కోట్లలోపే సినిమా పూర్తయ్యిందన్నమాట. ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వరుస పరాజయాల్ని ఎదుర్కొంది. సినిమాలన్నీ నష్టాల్ని మిగిల్చాయి. ఆ నష్టాలన్నీ ‘రాజాసాబ్’ తో తీరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.