అన్ స్టాపబుల్ తో టాక్ షోలకు కొత్త గ్లామర్ తీసుకొచ్చారు బాలకృష్ణ. ఆహా వేదికగా ప్రసారమౌతున్న ఈ షో తెలుగు ప్రేక్షకులని విశేషంగా అలరించింది. ఈ మధ్యనే సక్సెస్ఫుల్ గా నాలుగో సీజన్ కూడా ప్రారంభమైంది. తొలి ఎపిసోడ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు రావడం మరొక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిజానికి టాక్ షోలు అంటే తెలుగులో అంత క్రేజ్ ఉండేది కాదు. చాలా వరకూ రొటీన్ గా జరిగేవి. కానీ నందమూరి బాలకృష్ణ తన ఎనర్జీ, పవర్ఫుల్ ప్రజెన్స్ తో ఈ టాక్ షో కి సరికొత్త వన్నె తెచ్చారు.
ఇప్పుడు రానా దగ్గుబాటి అమెజాన్ ప్రైమ్ వేదికగా ఒక టాక్ షో కి శ్రీకారం చుట్టారు. ఈ షోకి నిర్మాత, క్రియేటర్, హోస్ట్.. ఈ మూడు బాధ్యతల్ని రానానే తీసుకున్నారు. ‘ది రానా దగ్గుబాటి షో’ అనే పేరుతో రానున్న ఈ షో నవంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇది కేవలం టాక్ షో మాత్రమే కాదని.. అంతకు మించిన సరదా సంభాషణలతో సాగుతుందని షో రన్నర్స్ తెలియజేస్తున్నారు.
ఫిల్టర్ లేకుండా మాట్లాడడం ఈ షో ప్రత్యేకతట. ఇందులో పాల్గొనే అతిధులు దాదాపుగా ఎలాంటి ముసుగు లేకుండా స్వేచ్ఛగా మాట్లాడేలా ఈ షోని డిజైన్ చేశారట. సెలబ్రిటీల గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియని చాలా పర్సనల్ విషయాల్ని ఈ షో లో రివిల్ చేస్తారట. అలాగే ఫన్ యాక్టివిటీస్ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని చెప్తున్నారు.
రానాకి హోస్టుగా మంచి అనుభవం ఉంది. ఆయనలో మంచి సమయస్ఫూర్తి, సంభాషణని ముందుకు నడిపే నైపుణ్యం ఉన్నాయి. పరిశ్రమలో దాదాపు అందరితో చాలా స్నేహంగా ఉంటారు రానా. ఇవన్నీ కూడా ఈ షోని లైవ్లీగా నడపడానికి పనికొచ్చే అంశాలు. అయితే బాలకృష్ణ అన్ స్టాపబుల్ లో బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ కనిపించారు. దాదాపుగా ఇండస్ట్రీలోని స్టార్స్ అంతా ఈ షో కి వచ్చారు. తన సినిమా ప్రమోషన్స్ కూడా ఎప్పుడూ రాని పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ కూడా బాలయ్యతో కలిసి అలరించారు.
వీటన్నిటితో పాటు హోస్ట్ గా బాలయ్య అందరిని సర్ప్రైజ్ చేస్తూ చాలా హుషారుగా ఈ టాక్ షో ని నడిపారు. నాలుగు సీజన్లు సక్సెస్ ఫుల్ గా సాగింది. ఇప్పుడు ఇదే చివరి సీజన్ అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలోనే రానా తన కొత్త టాక్ షో తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి రానా షో, అన్ స్టాపబుల్ లాంటి మరో సక్సెస్ఫుల్ షో అవుతుందో లేదో చూడాలి.