ఈ తమిళ బ్రాహ్మణుడు చూపులకు మెతకగా కనిపిస్తాడు. కానీ అపర చాణక్యుడు. కుంభకోణాల దుమ్ము దులపడంలో దిట్ట. కోర్టులో పిటిషీన్ దాఖలు చేశాడంటే అవతలి వ్యక్తి ఎంతటి ఘనుడైనా వణికిపోవాల్సిందే. ఇవ్వాళ నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కోర్టు ముందు నిలబెట్టింది ఇతగాడే. సోనియా, రాహుల్ కు షరతులులేని బెయిల్ మంజూరు అయినప్పటికీ నిజమైన విజయం సాధించిన సంతృప్తి మాత్రం డాక్టర్ సుబ్రమణియన్ స్వామి కళ్లలో కనిపిస్తోంది. అందుకే ఈ స్వామే ద రియల్ హీరో.
పటియాలా హోజ్ కోర్టుకి రావాల్సివస్తుందనికానీ బెయిల్ కోసం దరఖాస్తు సమర్పించుకోవాల్సి వస్తుందనికానీ సోనియా, ఆమె ముద్దుల కొడుకు రాహుల్ బహుశా అనుకుని ఉండరు. కోర్టు హాల్ లో నిందితులు నిలబడేచోట సోనియా, రాహుల్ నిలబడటం, బెయిల్ కోసం అభ్యర్థించాల్సి రావడమే స్వామి సాధించిన విజయం. ఇక కోర్టు కేసు సంగతి అంటారా, అది విచారణకు వస్తుంటుంది, మళ్ళీ వాయిదా పడుతుంటుంది. కోర్టు తనపని తాను చేసుకుంటూ పోతుంది.
తల్లీ కొడుకులకు బెయిల్ మంజూరైనప్పటికీ తనదే విజయమని సుబ్రమణియన్ స్వామి అంటున్నారు. 76ఏళ్ల వయసులో ఆయన చాలా హుషారుగా కనబడుతున్నారు. నేషనల్ మీడియా సిఎన్ఎన్ -ఐబిఎన్ ఛానెల్ లో ఆయన విజయగర్వంతో మాట్లాడటం కనిపించింది. వీరిద్దరిని కోర్టు హాలుకు తీసుకురావడం బహుశా భారతీయులందరికీ సంతోషం కలిగించి ఉంటుందని స్వామి వ్యాఖ్యానించారు. `నిందితులు నిలబడే చోట వీరిద్దరు నిల్చున్నారు. వారికి కూర్చునే అవకాశమే లేదు. ఇది ప్రజాస్వామ్య విజయం ‘ అంటూ తెగ ఆనందపడిపోయారు స్వామి. తన పిటీషన్లకీ, బిజెపీకి సంబంధం లేదని కుండబద్దలుకొట్టినట్లు చెప్పారు. తాను సన్యాసినని, తనకు ఎవ్వరూ బంగ్లాలు ఇవ్వక్కర్లేదని అంటున్నారు.
1939 సెప్టెంబర్ 15న జన్మించిన సుబ్రమణియన్ స్వామి బహుముఖ ప్రజ్ఞావంతుడు. రాజకీయాలు, గణితం, ఆర్థికశాస్త్రం…ఇలా అనేక రంగాల్లో ఆయన తన ప్రతిభకనబరిచారు. ఇవన్నీ ఒక ఎత్తైతే, కోర్టులో పిటీషన్లు వేయడంలో దిట్ట. ఆయన పిటీషన్ వేశారంటే, అభియోగం మోపబడిన వ్యక్తి ఎంతటి ఘనుడైనా మూడిందన్నమాటే. ముప్పతిప్పలుపెట్టి మూడుచెరువుల నీళ్లు తాగించడం ఖాయం.
స్వామి వేసిన పిటీషన్ కారణంగానే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై లెక్కకు మించిన ఆస్తులకేసులో ఉక్కిరిబిక్కిరయ్యారు. జైలుజీవితం గడపాల్సివచ్చింది. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం వెలుగులోకి రావడంలో ఈయన కీలకపాత్రపోషించారు. ఎ. రాజాచేత ఊచలు లెక్కబెట్టించారు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు అవకతవకల విషయం లేఖద్వారా ప్రస్తావించినప్పటికీ, ఆయన పట్టించుకోలేదు. దీంతో స్వామి తనకుతానుగా సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో సిబీఐ విచారణ సాగడం, తీగలాగితే డొంకంతా కదలడం జరిగిపోయాయి. స్వామి చేపట్టిన కేసుల్లో నటరాజ టెంపుల్ కేసు, హాషింపురా ఊచకోత కేసుల్లాంటివి చాలానే ఉన్నాయి. ఏ కేసు పట్టుకున్నా అదో సంచలనమే.
నేషనల్ హెరాల్డ్ నిధుల దుర్వినియోగం విషయంలో సోనియా, రాహుల్ పై పిటీషన్ దాఖలు చేసేసమయంలో స్వామి బిజెపీలో లేరు. ఈ కేసు ఫైల్ చేసింది 2012లో. ఒక ప్రైవేట్ సిటిజన్ గానే తాను సోనియా, రాహుల్, మోతిలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండేజ్, సుమన్ దూబె, సామ్ పిట్రోడాలపై మోసానికి పాల్పడ్డారన్నఅభియోగంపై పిటీషన్ దాఖలు చేశారు. ఆ కేసుమీదనే ఇవ్వాళ విచారణ ప్రారంభం కావడం, కేవలం 3 నిమిషాల్లోనే సోనియా, రాహుల్ సహా మిగతావారికి బెయిల్ మంజూరుకావడం జరిగిపోయింది. ఇదే కేసు నేపథ్యంలోనే సోనియా బిజెపీమీద మండిపడుతున్నారు. తాను ఇందిరాగాంధీ కోడల్ని ఎవరికీ భయపడనంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. అయినప్పటికీ స్వామి పిటీషన్ కారణంగా కోర్టు ముందు హాజరుకావాల్సివచ్చింది. అందుకే స్వామి నిజమైన హీరో అయ్యారు.
– కణ్వస