హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అనుచరుడు సీతాపల్లి అభీష్ట ఇటీవల అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ) పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీ, ప్రభుత్వం రెండింటిలో బాధ్యతలు నిర్వర్తించటం కష్టమైపోవటంతో అభీష్ట తన పదవికి రాజీనామా చేశారని, ఇకనుంచి పార్టీ వ్యవహారాలపైనే దృష్టి పెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ అసలు కారణం అదికాదని తెలిసింది. ఐఏఎస్ అధికారులపై, వివిధ శాఖల కార్యదర్శులపై అభీష్ట అజమాయిషీ పెరగిపోవటం, కార్యదర్శి స్థాయి ఐఏఎస్ అధికారులను సైతం తన ఛాంబర్‌కు పిలిపించుకుని ఆదేశాలు జారీచేయటంతో పలువురు బ్యూరోక్రాట్లు అతనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారని సమాచారం. మరోవైపు కొందరు ఉన్నతాధికారులు ప్రతిపక్షాలకు కూడా దీనిగురించి లీకులిచ్చి వారితో అభీష్టపై ఆరోపణలు చేయించారని కూడా చెబుతున్నారు. అందుకనే కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అభీష్టపై రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారని అంటున్నారు. వీటన్నింటితో చంద్రబాబు విసుగుచెంది లోకేష్‌కు సూచనలు చేశారని, అందుకే లోకేష్ అభీష్టతో రాజీనామా చేయించారని తెలిసింది. అయితే అభీష్ట స్థానంలో చినబాబు మనిషి మరొకరు త్వరలో వస్తారని కూడా చెబుతున్నారు.