జస్టిస్ చంద్రు ఏపీ హైకోర్టు మీద సందర్భం లేకుండా చేసిన వ్యాఖ్యలతో ఆయన గత చరిత్ర మొత్తం సోషల్ మీడియాలో బయటకు తీస్తున్నారు. గతంలో ఆయనపై ఉన్న వివాదాలు.. ఆయన ఉన్న రాజకీయ పార్టీలు, ఆయన చేసిన రాజకీయాలు కూడా ఆయనే స్వయంగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. రిటైరైన తర్వాత పదవుల కోసం ఆయన ఇలా చేస్తున్నారని జస్టిస్ చంద్రు పేరు ఎత్తకుండా చంద్రబాబు విమర్శించారు. దీనిపై జస్టిస్ చంద్రు స్పందించారు. అదంతా అబద్దమని.. అదెవరూ నమ్మవద్దన్నారు. తాను రిటైరైన తర్వాత తొమ్మిదేళ్లలో ప్రభుత్వం నుంచి ఎలాంటి పదవి ఆశించలేదని చెప్పారు. కానీ ఆయన తమిళనాడు ప్రభుత్వం నియమించిన కాలేజీ ఫీజులు నిర్ణయించే కమిటీ చైర్మన్ పదవి పొందారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వెలుగులోకి తెచ్చింది. అలాగే ఆయన రాజకీయ సంబంధాలనూ వెలుగులోకి తెచ్చింది. ఎం.ఎస్ రా అండ్ రెడ్డి లీగల్ కంపెనీతో ఆయనకు ఉన్న సంబంధాలపైనా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆ కంపెనీతో సంబంధాలు ఉన్న మాట నిజమేనని అప్పట్లో తాను సీపీఎం పార్టీలో ఉన్నానని జస్టిస్ చంద్రు చెప్పుకొచ్చారు. చంద్రబాబు చేసిన విమర్శలను ఆయన తోసిపుచ్చారు. అయితే హైకోర్టుకు వ్యతిరేకంగా కామెంట్లు చేయాల్సిన పరిస్థితిని ఆయన సమర్థించుకోలేకపోయారు.
అమరావతి అంశంపై తప్పుడు వివరాలతో రాసిన ఆర్టికల్స్‌పై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. తమిళనాడు ప్రభుత్వ పదవి తీసుకున్నా.. ఎలాంటి పదవులు తీసుకోలేదని చెప్పారు. ఏపీ ప్రభుత్వం కూడా పలువురు మాజీ న్యాయమూర్తులకు ఇలాంటి ఫీజులు నిర్ణయించే కమిటీల చైర్మన్ పదవులు ఇచ్చింది. మొత్తంగా జస్టిస్ చంద్రుకు జై భీమ్‌తో వచ్చిన పాజిటివ్ ఇమేజ్ ఒక వైపే చూపించింది. కానీ ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల ఆయన రెండో కోణం కూడా బయటకు వస్తోందన్న అభిప్రాయం సోషల్ మీడియాలో వినిపిస్తోంది.