సుకుమార్ – దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మ్యూజికల్ గా… అది సూపర్ హిట్టే. `పుష్ష` తొలి పాటతో ఆ మార్క్ ఏమిటో బయటపడింది. దాక్కో దాక్కో మేక – అంటూ మంచి బీట్ ఉన్న పాట అందించాడు సుకుమార్. ఇప్పుడు శ్రీవల్లి (రష్మిక) కోసం కూడా ఓ పాట వదిలారు. `చూపే బంగారమాయెనే శ్రీవల్లీ` అంటూ రెండో పాటని ప్రేక్షకులకు వినిపించారు. సిద్ద్ శ్రీరామ్ ఈ పాటని ఎంత శ్రావ్యంగా పాడాడో.. అంతే అందంగా చంద్రబోస్ సాహిత్యం అందించారు.
నిజానికి ఇది శ్రీవల్లి పాట కాదు. శ్రీవల్లి కోసం.. పుష్ష పాడుకునే పాట.
”నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండూ తిప్పేస్తావే
నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే..
కనిపించని దేవుడ్నే కన్నార్పక చూస్తావే..
కన్నుల ఎదుటే నేనుంటే – కాదంటున్నావే…
చూపే బంగారమాయెనే శ్రీవల్లీ
మాటే మాణిక్యమాయెనే.. ”
అంటూ మొదలైన గీతమిది. శ్రీవల్లి కోసం పుష్ష ఎన్ని పాట్లుపడ్డాడో.. ఈ పాటలో వివరించే ప్రయత్నం చేశారు. అందరి ముందూ రంకెలేసే పుష్ష.. శ్రీవల్లి కోసం ఎంత ఒదిగి ఉంటాడో తరువాతి చరణాల్లో వినిపించారు.
`”న్నిటికీ ఎప్పుడూ ముందుండే నేను
నీ వెనకే ఇప్పుడూ పడుతూ ఉన్నాను…
ఎవ్వరికీ ఎపుడూ తలవంచని నేను
నీ పట్టీని చూసేటందుకు తలనే వంచాను” అంటూ పాట సాగిపోయింది.
అప్పటికీ పడకపోవడం వల్లోనేమో… శ్రీవల్లి అందం గురించి చంద్రబోస్ కొన్ని సెటైర్లు వేశాడు.
”నీ స్నేహితురాళ్లు ఓ మోస్తరుగ ఉంటారు
అందుకనే నువ్వు అందంగుంటావు
పద్దెనిమిది ఏళ్లు వస్తేనే చాలు
నువ్వేనే కాదు అందరు ముద్దుగుంటారు” అంటూ చివరి చరణం నడిపించారు.
మొత్తానికి సుకుమార్ టేస్ట్ ఈ పాట మరోసారి బయటపెట్టింది. లిరికల్ వీడియోల్లో ఇదో కొత్త తరహా వీడియో. మినియేచర్లతో, యానిమేషన్‌తో.. వీడియో రూపొందించారు. పుష్ష వేసిన `జోడు` స్టెప్పు హైలెట్. స్టెప్పు వేస్తుంటే చెప్పు జారిపోవడం.. ఎవ్వరూ చూడలేదు కదా, అని చుట్టూ చూస్తూ ఆ చెప్పు మళ్లీ వేసుకోవడం చాలా సహజంగా ఉంది.