కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు తెలంగాణలో పార్టీని నిలబెట్టుకోవాలన్న ఆలోచన పెద్దగా ఉన్నట్లుగా లేదు. అన్ని రాష్ట్రాల్లో పార్టీ పరమైన సమస్యల పరిష్కారానికి ఏదో ఒకటి చేస్తున్నప్పటికీ.. తెలంగాణ విషయంలో మాత్రం నాన్చివేత ధోరణి అవలంభిస్తోంది. ప్రతీసారి రేవంత్ రెడ్డి పేరు ఖరారయిందని ప్రచతారం జరగడం… ఆయనకు వ్యతిరేకంగా ఓ గ్రూప్ .. రెడీ అయి రచ్చ చేయడం కామన్ అయిపోయింది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇదిగో పీసీసీ చీఫ్‌ను ప్రకటించేస్తున్నారంటూ… లీక్ రాగానే.. వీహెచ్ నుంచి జగ్గారెడ్డి వరకూ అందరూ బయటకు వచ్చారు. చివరికి చేరాల్సిన వారంతా ఢిల్లీకి చేరారు. తీరా అక్కడ మాత్రం హైకమాండ్… ఇప్పుడు కాదు.. ఇంకాస్త ఆలోచిస్తామని సమాచారం ఇచ్చిందట.
కొద్ది రోజుల కిందట కేరళ పీసీసీ ప్రెసిడెంట్ ను ప్రకటించిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో హడావిడి మొదలైంది. ఢిల్లీ పెద్దలు పీసీసీ ఎంపిక మీద ఫోకస్ పెట్టినట్లు జరిగిన ప్రచారంతో టి.కాంగ్రెస్ నేతలు అలెర్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధుయాష్కీ వంటి నేతలు ఢిల్లీ చేరుకున్నారు. కొందరు నేతలు హస్తినలోనే మకాం వేసి మంత్రాంగం నడుపుతుండగా, మరికొందరు హైద్రాబాద్, ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. పీసీసీ కోసం ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మానిక్కం ఠాగూర్.. సోనియాగాంధీ కి ఓ నివేదికను సమర్పించారు. దాని పై అధినేత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఢిల్లీ లో ఏం జరుగుతుందో ఏమోగాని రేవంత్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపుతోందని లీకులు వచ్చాయి. ఇంచార్జి మానిక్కం ఠాగూర్ తో పాటు ఏఐసీసీ జెనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ ఇద్దరు కూడా రేవంత్ పేరునే ప్రతిపాదిస్తున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దాంతో టి.కాంగ్రెస్ లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. సీనియర్లు, ఇతర ఆశావహులు అంతా అప్రమత్తం అయ్యారు. పార్టీలో మొదటి నుంచి పని చేస్తోన్న సీనియర్ లకే పగ్గాలు అప్పగించాలని హైకమాండ్ మీద ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. కర్ణాటక, పంజాబ్ తరహాలో తెలంగాణకు కూడా పరిశీలకుల కమిటీ ని వేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. చివరికి ప్రకటన వాయిదా వేయడం ఖాయమని లీక్ వచ్చింది. దీంతో కాంగ్రెస్ క్యాడర్ మరోసారి ఉసూరుమంటోంది.