ఇద్దరు రెడ్లు, ఇద్దరు బీసీలు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇతర అగ్రవర్ణలేమీ కంటికి కనిపించలేదు. ఇద్దరు నెల్లూరు నేతలు.. ఇద్దరు తెలంగాణ నేతలు. ఏపీలో నెల్లూరు తప్ప ఇంకెవరూ రాజ్యసభకు వెళ్లడానికి అర్హత లేనట్లుగా ఉంది. నెల్లూరు నుంచి ఇప్పటికే మరో రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ఉన్నారు. టీడీపీ నేపధ్యం ఉన్న ఇద్దరికి .. అక్రమాస్తుల కేసులతో సంబంధం ఉన్న ఇద్దరికి అవకాశం. ఆర్ కృష్ణయ్య తెలంగాణలో టీడీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు… రాజ్యసభ సీటు ఆఫర్ చేసి బీద మస్తాన్ రావును టీడీపీ నుంచి వైసీపీలో జాయిన్ చేసుకున్నారు.
వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో ఇలాంటి సమీకరణాలు చూస్తే ఎక్కడా ప్రజా ప్రయోజనాలు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడటం …కేంద్రంపై పోరాట అనే సమీకరణాలను అసలు చూసుకోలేదు. అన్నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చూసుకున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. రాజ్యసభ సభ్యులను ఈ కోణంలో ఇలా ఎంపిక చేయడంలో గతంలో ఏ రాజకీయ పార్టీ చేయలేదు. మొదటి సారి జగన్ చేశారు.
ఆర్.కృష్ణయ్యకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే.. అది కేసీఆర్ కోటా అని చెబుతున్నారు. తెలంగాణ కోటా నుంచి విజయసాయిరెడ్డి వియ్యంకుడు .. ఓ ఫార్మా కంపెనీ అధిపతిని రాజ్యసభకు పంపబోతున్నారని దానికి ప్రతిఫలంగా ఇక్కడ టీఆర్ఎస్ చాయిస్ కింద రాజ్యసభకు కృష్ణయ్యకు ఇచ్చారని అంటున్నారు. ఏపీలోనే ఆ ఫార్మా అధిపతికి ఇవ్వొచ్చు కానీ ఆయన రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు. బీసీ కోటాను ఉద్దరించామని చెప్పుకోవాలి కాబట్టి లెక్క కోసం ఇలా ఛేంజ్ చేసుకున్నారన్నమాట. మొత్తంగా రాజకీయాలంటే కొత్త అర్థం చెప్పేస్తున్నారు.. ప్రజాప్రయోజనాలు అనే మాటే అందులో ఉండటం లేదు.