దిశ నిందితుల ఎన్ కౌంటర్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా అప్పట్లో సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్న సజ్జనార్ కే ప్రశంసలు దక్కాయి. అది నిజమైన ఎన్ కౌంటర్ అని ఎవరూ అనుకోలేదు. అనుకోవడం లేదు కూడా. ఆయితే ఆయన చేసిన న్యాయానికి ప్రజామోదం లభించింది. కానీ చట్టాల ఆమోదం లభించే అవకాశం కనిపించడం లేదు. ఈ ఎన్ కౌంటర్ బూటకమో కాదో తేల్చడానికి సుప్రీంకోర్టు నియమించిన సిర్పూర్కర్ కమిషన్ చురుగ్గా విచారణ జరుపుతోంది. అందర్నీ ప్రశ్నించిన తర్వాతఇప్పుడు మెల్లగా సజ్జనార్ వద్దకు విచారణ చేరుతోంది.
సజ్జనార్‌ను ప్రశ్నించాలని సిర్పూర్కర్ కమిటీ నిర్ణయించి సమన్లు జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది. మరో వైపు దిశ హత్యాచారం, ఎన్‌కౌంటర్‌పై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం చీఫ్‌గా మహేశ్ భగవత్‌ను నియమించింది. ఆయన ఇప్పటికే పలుమార్లు కమిషన్ ముందు హాజరయ్యారు. అనేక విషయాలను ఆయన కమిషన్‌కు వివరించారు. ఆయితే ఆయన చెప్పిన విషయాల్లో చాలా వరకు పొంతన లేనివి ఉండటంతో మళ్లీ మళ్లీ పిలుస్తున్నారు.
అధికారులు సరైన వివరాలు చెప్పకపోవడం… ఎన్ కౌంటర్ విషయంలో కమిషన్ లెవనెత్తుతున్న సందేహాలను క్లియర్ చేయడంతో తడబడుతూండటం సజ్జనార్‌కు ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. సిర్పూర్కర్ కమిషన్ ఎన్ కౌంటర్ బూటకమని నివేదిక ఇస్తే సజ్జనార్ కెరీర్లో తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. విచారణ తర్వాత సిర్పూర్కర్ కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనుంది.