భారత్ గర్వించదగ్గ ఎనిమిది మంది వివిధ క్రీడాకారులు కలిసి ఆలపించిన జనగణమన జాతీయ గీతం వీడియో ‘ది స్పోర్ట్స్ హీరోస్’ అనే వీడియోని నిన్న ముంబైలో సచిన్ టెండూల్కర్, ధనరాజ్ పిళ్ళై తదితరుల సమక్షంలో విడుదల చేసారు. అభిజిత్ పాన్సే దర్శకత్వం వహించిన ఈ లఘు వీడియో చిత్రంలో అలనాటి మేటి క్రికెటర్ సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, ధనరాజ్ పిళ్ళై (హాకీ), సానియా మీర్జా, మహేష్ భూపతి (టెన్నిస్), బైచుంగ్ భూటియా(ఫుట్ బాల్), సుషీల్ కుమార్ (కుస్తీ), గగన్ నారంగ్ (షూటింగ్) కలిసి జాతీయగీతం ఆలపించారు.
ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ, “2011 వరల్డ్ కాంగ్రెస్ పార్టీ ఫైనల్ కి ముందు జనంతో కిక్కిరిసిన వాంఖడే స్టేడియంలో నిలబడి అందరం కలిసి జాతీయగీతం ఆలపిస్తునప్పుడు ఎంత గర్వంగా ఉందో మాటలలో వర్ణించలేను. అదొక గొప్ప మధురానుభూతి. నా జీవితంలో ఎన్నడూ అది మరిచిపోలేను. 2003సం.లో పాకిస్తాన్ టీమ్ తో వరల్డ్ కప్ ఫైనల్ ఆడినపుడు సుమారు 60,000 మంది ప్రేక్షకులతో కలిసి జాతీయగీతం ఆలపించడం అంతకంటే గొప్ప మధురానుభూతిని కలిగించింది. జనగణమన గీతం ఆలపిస్తునప్పుడు మన శిరసులు గర్వంతో పైకి ఎత్తి ఉంటాయి. వేలాదిమంది ప్రేక్షకులతో కలిసి మైదానంలో నిలబడి పాడుతున్నప్పుడు ఏదో చెప్పలేని ఆనందం, గర్వంతో మన ఛాతి ఉప్పొంగుతుంది. ఆ అనుభూతిని తలుచుకొన్నప్పుడు నేటికీ నా ఒళ్ళు పులకరిస్తుంది. నేటికీ ఆ దృశ్యం నా కళ్ళ ముందు సజీవంగా కదలాడుతూనే ఉంటుంది. ఆ గొప్ప అనుభూతిని ఎన్నటికీ మరిచిపోలేను,” అని అన్నారు.
ప్రముఖ క్రీడాకారులకు జాతీయగీతంతో ముడిపడున్న అనుబంధాన్ని వారి అనుభూతులను ఈ వీడియో ద్వారా తెలియజేయడం ద్వారా దేశ ప్రజలకు, యువక్రీడాకారులలో జాతీయభావం, ప్రేరణ కల్పించేందుకు ‘ది స్పోర్ట్స్ హీరోస్’ అనే ఈ వీడియోని రూపొందించారు. దీనిలో ప్రముఖ క్రీడాకారులు అందరూ కలిసి జనగణమన జాతీయ గీతం ఆలపించారు. దానిలో వారి అనుభూతిని ప్రజలతో పంచుకొన్నారు. మాజీ క్రికెటర్ నీలేష్ కులకర్ణి స్థాపించిన ఇంటర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజిమెంట్ సంస్థ అద్వర్యంలో దీనిని ముంబైలో నిన్న విడుదల చేసారు.